పైర‌సీపై ఫైట్ చేస్తున్న ఫ్యాన్స్

Thursday, September 29th, 2016, 12:23:32 AM IST

piracy
సినీ ప‌రిశ్ర‌మ‌ని పైర‌సీ భూతం ప‌ట్టి పీడిస్తోంది. ఎంత టెక్నాల‌జీ వాడినా రిలీజ్ రోజునే సినిమా ఇంట‌ర్నెట్ లో ద‌ర్శ‌నిమిస్తోంది. దీనిపై నిర్మాత‌లు..ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా ఫ‌లితం లేకుండా పోతోంది. యాంటీ పైర‌సీ విభాగం అక్క‌డ‌క్క‌డా పైర‌సీ దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురాలేక‌పోతుంది. ఫ‌లితంగా కోట్ల‌ రూపాయ‌ల న‌ష్టం క‌లుగుతోంది. సినిమా మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌క‌రంగా మారుతోంది. ఇదే గ‌నుక కంటిన్యూ అయితే సినిమాలు చేయ‌డానికి ఏ నిర్మాతా ముందుకు రాడు. ప్ర‌స్తుతం అన్నిభాష‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఇదే డిస్క‌ష‌న్.

అయితే తాజాగా పైర‌సీపై త‌మిళ తంబీలు, హీరోల‌ అభిమానులు భ‌గ్గుమంటున్నారు. కొత్త సినిమాలు పైర‌సీ కాకుండా చూస్తామని హీరో విజ‌య్ ఫ్యాన్స్ కంక‌ణం క‌ట్టుకున్నారు. దీనిపై అంద‌రి హీరోల అభిమానులు ఒకే తాటిపైకి వ‌చ్చి ఫైట్ చేస్తే బాగుటుంద‌ని చ‌ర్చించుకున్నారుట‌. ఈ విష‌యాన్ని విశాల్, ధ‌నుష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఇప్ప‌టికే అన్ని పోలీస్టేష‌న్ల‌లో పైర‌సీ కి వ్య‌తిరేకంగా ఫ్యాన్స్ కేసులు న‌మోదు చేశార‌ట‌. చిన్న హీరో, పెద్ద హీరో అనే తార‌త‌మ్యం లేకుండా అంద‌రి సినిమాల‌ను పైర‌సీ నుంచి కాపాడాల‌ని న‌డుం బిగించారు. రాష్ట్రంలో ఏ మూల పైర‌సీ జ‌రిగినా వెంట‌నే ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఆ దొంగ‌ల్ని పోలీసుల‌కు ప‌ట్టించే విధంగా అభిమాన సంఘాలు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు స‌మాచారం.