ఫ్లాష్ న్యూస్ : గరుడ వేగా సినిమా పై నిషేధం!

Thursday, April 12th, 2018, 04:17:16 PM IST

ఇదివరకు అంకుశం, ఆహుతి, మగడు వంటి చిత్రాల్లో నటించడం ద్వారా హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు గాంచారు. ఆ తరువాత ఆయన కొన్ని మంచి చిత్రాలు చేసినప్పటికీ వాటిలో ఫామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువ చేశారు .అయితే గత కొద్దీ సంవత్సరాలుగా ఆయన సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ రాక సతమతమవుతున్నారు. అయితే ఇన్నాళ్లకు ఆయనకు గరుడ వేగా రూపంలో మంచి విజయం అందుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయన మరోసారి పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం ‘గరుడ వేగ’ చిత్రానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రదర్శనలు ఉండరాదని సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

టీవీల్లోగానీ, యూట్యూబ్, ఇతరత్రా ఏరకంగానూ ప్రదర్శన ఉండరాదని, దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దీని ప్రదర్శనలను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌ ఉప్పరపల్లిలోని అటమిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదనలు వినిపిస్తూ మొత్తం సినిమా యురేనియం కార్పొరేషన్‌లో జరిగిన స్కాం గురించి ఉందన్నారు. తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లి, ఉందన్నారు.

యురేనియం స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించారని, ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ కమిషనర్‌గా హీరో స్కాంను బట్టబయలు చేస్తున్నట్లు చూపారన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. వాదనలను విన్న జడ్జి పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆ చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి వుంది…..