వైఎస్ బయోపిక్ “యాత్ర” మొదలు

Friday, April 6th, 2018, 11:48:55 PM IST


ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఓ ప్రక్క మహానటి సావిత్రి, అలానే నటరత్న ఎన్టీఆర్ ల బయోపిక్ లు తెరకెక్కుతుంటే మరోవైపు చాలా రోజులనుండి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ కూడా తెరకెక్కబోతోంది అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎట్టకేలకు ఈ బయోపిక్ పై అఫీషియల్‌ ప్రకటన వెలువడింది. ‘యాత్ర’ పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్ర టైటిల్‌ లోగోను నేడు విడుదల చేశారు. అయితే మళయాళ మెగాస్టార్‌ మమ్మూటీ ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్న విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

ఏప్రిల్‌ 9 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకాబోతోంది. పాఠశాల, ఆనందోబ్రహ్మ చిత్రాల దర్శకుడు మహీ.వి.రాఘవ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఒక్క అడుగుతో చర్రిత సృష్టించే బదులు, జనాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అనే ఇంగ్లీష్‌ కాప్షన్‌ను పెట్టారు. ‘కడప దాటీ ప్రతీ గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’ అన్న సందేశంతో థీమ్‌ లోగోను డిజైన్ చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు సంబంధించిన విషయాలను చిత్రంలో ప్రధానాంశంగా చూపించబోతున్నారని స్పష్టమౌతోంది.

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. మిగతా తారాగణం వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది. మరోవైపు మమ్మూటీ కూడా తన ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. సుమారు పాతికేళ్ల తర్వాత ఆయన తిరిగి తెలుగులో నటిస్తుండటం విశేషం. గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం చిత్రాల్లో నటించారు. త్వరలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి….