వైరల్ అవుతున్న గాయత్రి డైలాగులు !

Sunday, February 11th, 2018, 05:14:31 PM IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలాకాలం తరువాత మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ వున్న రోల్ పోషించిన చిత్రం గాయత్రి. పెళ్ళైన కొత్తలో ఫేమ్ మదన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి ప్రసంశలు అందుతున్నాయి. విష్ణు, శ్రేయాల జంట బాగుందని, ఇకపోతే ఈ చిత్రం లోని రెండుపాత్రలకు మోహన్ బాబు సమాన న్యాయం చేశారని, ముఖ్యంగా గాయత్రి పటేల్ పాత్రలో అయన నటన అద్భుతమని ప్రసంశలు వస్తున్నాయి. అయితే చిత్రంలో ఆయన పలికిన డైలాగులతో తెలుగు రాజకీయాల్లో ఒక చిన్న చర్చకు తెరతీస్తోందని సమాచారం. ఒకప్పుడు టిడిపి ఎంపీగానూ పనిచేసిన మోహన్ బాబు ఇప్పుడున్న రాజకీయ నాయకుల తీరును తన డైలాగులతో ఏకేసినట్లనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఆయన పలికిన డైలాగులు విన్నవారు అవి ప్రస్తుతమున్న కొందరు నాయకులను ఉద్దేశించి అంటున్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇప్పుడా డైలాగులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

”అటవీ శాఖ మంత్రికి జాతీయ పక్షి ఏంటో తెలియదు. క్రీడా శాఖ మంత్రికి ఒలంపిక్స్ లో ఎన్ని మెడల్స్ వచ్చాయో తెలియదు, బీకాంలో ఫిజిక్స్ చదివానంటాడు ఒకడు. బీఎస్సీలో హెచ్ ఈసీ చదివానంటాడు మరొకడు. నేనిచ్చే పించన్ తీసుకుంటూ నేనేసిన రోడ్లపై నడుస్తూ నాకెందుకు ఓటు వేయరు అనే వాడు మరొకరు. భారతదేశ సార్వభౌమాధికారం అని పలకడం రాక సార్వబౌబౌ అని అరిచేవారు ఇంకొందరు. వీరు మన మంత్రులు వీరికి మేం ఓట్లేయాలి” అంటూ తన స్టైల్ లో మోహన్ బాబు చెప్పిన భారీ డైలాగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఒక్క డైలాగులో ఆయన నలుగురైదుగురు నేతలపై పంచ్ విసిరినట్లనిపిస్తోందని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగ్ లు పలికారని విషయం అటుంచితే, డైలాగ్ లు తెరపై పలికించే తీరులో ఆయనకు ఆయనే సాటి అని మరొకసారి నిరూపించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు కాగా గత శుక్రవారం విడుదలయిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాధరణతో ముందుకు దూసుకుపోతోంది….