సీఎం కేసీఆర్‌కు గాంధీ ఆసుపత్రి వైద్యురాలు సూటి ప్రశ్న.. అవసరమా ఇప్పుడు?

Thursday, July 9th, 2020, 05:55:05 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి గాంధీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న విజయలక్ష్మీ సూటి ప్రశ్నలు కురిపిస్తున్న వీడియో సంచలనంగా మారింది. కరోనా సమయంలో సచివాలయాన్ని కూల్చడం అవసరమా అని నిలదీశారు. కరోనా బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా బెడ్లు దొరకడం లేదని అదే సచివాలయాన్ని కోవిడ్ ఆసుపత్రిగా ఉపయోగించుకుని ఉంటే 10 వేల బెడ్లు పట్టేవని అన్నారు.

అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు కోట్లు పెట్టి కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. వాస్తు బాగాలేదని అనుకుంటే కేసీఆర్ సీఎం ఎలా అయ్యారని అన్నారు. ఇకపోతే కేంద్రం బృందం వచ్చినప్పుడు సినిమా లెవల్లో గచ్చిబౌలి టిమ్స్‌ను చూపించారని కానీ అసలు దానిని ఉపయోగించడమే లేదని అన్నారు. ఇక కరోనా వచ్చిన మీ ప్రజా ప్రతినిధులే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతుంటే సాధారణ ప్రజలు ఎలా ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముతారని వారికి ప్రాణాలపై ఆశ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలలో స్కూళ్ళు, ఫంక్షన్ హాళ్ళను కోవిడ్ ఆసుపత్రులుగా మారుస్తున్నారని, ఇంటింటి సర్వేలు చేసేందుకు వంటి వాటికి డబ్బులు ఖర్చు చేయండని అన్నారు. కేవలం సెక్రటరియేట్ అంటూ కరోనా నుంచి జనాల మైండ్ డైవర్ట్ చేస్తున్నారే తప్పా ఏమీ లేదని కరోనా ఎక్కడకు పోలేదని జనాలు జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.