జ‌గ‌న్ మాట కోసం టీడీపీ నేత ఎదురుచూపు!

Thursday, June 6th, 2019, 11:58:24 AM IST

ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి జంప్ కావ‌డం టీడీపీ నేత గంటా శ్రీ‌నివాస‌రావుకు నిత్య‌కృత్యం. గ‌తంలో కాంగ్రెస్ నుంచి పీఆర్పీకి మారిన ఆయ‌న ఆ త‌రువాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. అక్క‌డా నిల‌క‌డ‌గా వుండ‌ని గంటా రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏర్ప‌డిన ప‌రిణామాల వ‌ల్ల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవ‌ల టీడీపీ దారుణంగా ఓట‌మి పాల‌వ్వ‌డం, అనూహ్యంగా వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించ‌డంతో మ‌ళ్లీ పార్టీ మారాల‌ని చూస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ అధికారంలో వుండ‌గా టీడీపీ నేత‌ల ప‌ప్పులు వ‌డ‌క‌వ‌ని గ‌మ‌నించిన గంటా శ్రీ‌నివాస‌రావు త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు నాయుడుకు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

అయితే గంటాని త‌న పార్టీలోకి తీసుకోవ‌డానికి వైఎస్ జ‌గ‌న్ సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. వైసీపీలోకి వెళ్లాల‌ని ఉవ్విళ్లూరుతున్న గంటా శ్రీ‌నివాస‌రావు తీరు న‌చ్చ‌కే జ‌గ‌న్ అయ‌న‌ను దూరం పెడుతున్నార‌ని వినిపిస్తోంది. ఇటీవ‌ల రెండు ద‌ఫాలుగా జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌ని గంటా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎలాంటి అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో అస‌హ‌నానికి గుర‌య్యారు. జ‌గ‌న్ సై అంటే గంటా గంట కొట్ట‌డానికి ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచే లాబీయింగ్ చేస్తున్నార‌ట‌. మ‌రి జ‌గ‌న్ మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకుని గంటాను ఆహ్వానిస్తాడా? అన్న‌దే ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది.