శివాజీ అస‌లు లాజిక్ మిస్స‌వుతున్నాడా?

Monday, February 11th, 2019, 11:21:41 AM IST

చాలా రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో హీరో శివాజీ ఓ సెన్సేష‌న్. కొంత గ్యాప్ లు ఉంటాయి కానీ అప్పుడ‌ప్పుడు మ‌ళ్లీ తెర‌పైకొచ్చి త‌న‌దైన శైలిలో కోటింగ్ ఇస్తూ ట‌చ్ లోకి వ‌స్తుంటాడు. ద‌క్షిణాదిపై ఉత్త‌రాది నేత‌ల ఆప‌రేష‌న్ అంటూ గ‌రుడ పురాణం లెక్క‌లు చెప్పిన శివాజీ తాజాగా ప్ర‌ధాన గుంటూరు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెర‌పైకొచ్చాడు. ద‌క్షిణాది నేత‌ల‌ని అస్థిరప‌ర‌చ‌డానికి బీజేపీ అధిష్టానం కుట్ర చేస్తోందంటూ సంచ‌ల‌నం సృష్టించిన శివాజీ జ‌ల దీక్ష పేరుతో ఆదివారం హ‌డావిడి చేశారు. గ‌తంలో బీజేపీలో చేరి టీడీపీ అధినాయ‌క‌త్వాన్ని చెడామ‌డా విమ‌ర్శించిన శివాజీ ఆ పార్టీ నుంచి త‌ప్పుకుని ఇప్పుడు బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు.

ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ ఏపీకి వ‌స్తున్న వేళ శివాజీ కృష్ణాన‌దిలో కొత్త పురాణం మొద‌లుపెట్టారు. ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను నిర‌సిస్తూ ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి కృష్ణాన‌దిలో జ‌ల దీక్ష‌కు పూనుకున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న ముగిసేంత వ‌ర‌కు బ‌య‌టికి రాన‌ని అన్నంత‌ప‌ని చేసి త‌న ఉనికిని మ‌రో సారి కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప‌నిలో ప‌నిగా జ‌న‌సేన‌పైనా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. అయితే ఈ క్యాలిక్యులేష‌న్‌లో ప‌డి శివాజీ ఓ లాజిక్కును మిస్స‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత రాత్రికి రాత్రే రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తిన శివాజీ అవ‌స‌ర నిమిత్తం సంద‌ర్భానికో వేషం అన్న‌ట్టుగా ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతూ త‌న‌కు తానే సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నాడంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీల‌ను తిట్టే క్ర‌మంలో ఒక్కో పార్టీకి శ‌త్రువుగా మారుతున్నా అవేవీ ప‌ట్ట‌న‌ట్టుగా శివాజీ వ్య‌వ‌హ‌రిస్తుడ‌టం రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. శివాజీ ఇదే పంథాను ఇలాగే కొన‌సాగిస్తే రానున్న రోజుల్లో అత‌ని ప‌రిస్థితి రెంటికి చెడ్డ‌ రేవ‌డిగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.