మహానటి యూనిట్ పై జెమిని కూతురి ఫైర్ !

Thursday, May 17th, 2018, 02:40:31 PM IST

దివంగత మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వైజయంతి సంస్థ రూపొందించిన చిత్రం మహానటి. విడుదలయిన తొలిరోజు నుండి సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. ఓ వైపు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చిత్రాన్ని మెచ్చుకుంటే మరోవైపు ఈ చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్ ను కించపరిచేవిధంగా చూపించారని ఆయన కుమార్తె, వైద్యురాలు కమల సెల్వరాజ్ మండిపడ్డారు. అసలు సావిత్రిగారిని మద్యం అలవాటు చేయించింది జెమినీ అని చూపించారు, అంతేకాక ఆ సమయంలో ఆయన బోలెడు చిత్రాలతో ఎంతో బిజీబిజీగా ఉంటే, అవకాశాలు లేక ఖాళీగావున్నట్లు చూపించారని అన్నారు.

తన తండ్రికి మొదటిసారిగా సావిత్రిగారి మీదనే ప్రేమకలిగిందని చిత్రంలో చూపారు, నిజానికి ఆయనకు సావిత్రిగారితో పరిచయానికి ముందు తమ తల్లితో అప్పటికే వివాహం అయిందని, అంటే అయన తమ తల్లిపై ప్రేమ లేకుండానే ఆమెను వివాహమాడరా అని ప్రశ్నించారు. చాలాచోట్ల నాన్నను ప్రేక్షకులు చూడని, అంగీకరించలేని విధంగా చూపించారని, నిజానికి అదే నిజమైతీ ఆయనను తమిళ ప్రజలు కాదల్ కన్నన్, అంటే తెలుగులో ప్రేమరాజు అని ఎలా పిలిచేవారని అన్నారు. అసలు సావిత్రిగారు అప్పట్లో ప్రాప్తం చిత్రం రీమేక్ చేద్దామన్న ఆలోచనను జెమినికి మొదట చెప్పారని, దానికి ఆయన స్పందిస్తూ అంతపెద్ద సాహసం చేయవద్దు, తేడావస్తే మరిన్ని సమస్యలొస్తాయని ఆవిడను వారించారన్నారు.

మరి సావిత్రి గారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నపుడు సహనటులు ఆమెకు సాయపడటానికి ఎందుకు ముందుకురాలేదన్నారు. ప్రాప్తం చిత్రం చేయవద్దని, సావిత్రిగారితో మాట్లాడదామని తన తండ్రితో కలిసి ఆమె సావిత్రిగారి ఇంటికివెళ్ళినపుడు ఒక కుక్కను ఉసిగొలిపి తరిమి కొట్టించారని, దానిబారి నుండి ఆరోజు తప్పించుకోవటానికి గోడదూకిన సన్నివేశం ఎప్పటికీ మరిచిపోలేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ అందరూ మహానటి చిత్రాన్ని మెచ్చుకుంటుంటే కమల సెల్వరాజ్ ఒక్కరే ఆ చిత్రంపై అభ్యన్తరాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం విడుదలయిన దాదాపు చాలా సెంటర్లలో ఇప్పటికీ మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది……

Comments