బైకర్లకు శుభవార్త – ఇకనుండి హెల్మెట్ పెట్టకున్నా పర్లేదు…?

Thursday, December 5th, 2019, 01:34:21 PM IST

ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా శిరస్త్రాణాన్ని ధరించాలని, లేకపోతె వారందరికీ కూడా జరిమానా రూపంలో పోలీసులు దండుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తమ ప్రాణాలను కాపాడుకోడానికి ఇలాంటి రక్షణా పద్ధతులను ప్రవేశపెట్టామని ప్రభుత్వం ఎప్పటికి చెబుతూనే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇకనుండి బైకులు నడిపేవారు హెల్మెట్ పెట్టుకోకపోయినప్పటికీ కూడా వారికి ఎలాంటి జరిమానా విధించేది లేదని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కానీ దాంట్లో కూడా కొన్ని కొన్ని షరతులను విధించిందిలేండి. అయితే రాష్ట్రంలోని మునిసిపల్ పరిధిలో ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి కాదని గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ గ్రామీణ రోడ్లు, జాతీయ, రాష్ట్ర హైవేలపై, సిటీ బయటి ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ వాడాల్సిందేనని, లేకపోతె జరిమానా తప్పదని తేల్చి చెప్పింది. అయితే గల్లీల్లో హెల్మెట్ వాడకంపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, అందుకనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని గుజరాత్ మంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.