త్వరలో తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఎవరు రాబోతున్నారో తెలుసా..!

Monday, June 10th, 2019, 05:01:30 PM IST

తెలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్ళు పూర్తి కావడంతో అప్పటి నుంచి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఒక్కరే ఉండిపోయారు. అందుకే ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను ప్రకటించే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ విషయం గురించి చర్చించడానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

అయితే దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుతం మారిపోయిన రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అంశంపై చర్చలు నడిచాయట. అయితే విభజన అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు మధ్య స్నేహపూర్వక సంబంధమే కనిపించిందని, రెండు రాష్ట్రాలకు రావలసిన అన్ని హోదాలు, నిధులు తప్పకుండా అందుతాయని, ఇరు రాష్ట్రాలకు ఖచ్చితంగా న్యాయం చేకూరుతుందని ఆయన అన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు వచ్చే అవకాశం ఉందని ఏపీ గవర్నర్‌గా సుస్మా స్వరాజ్ రాబోతున్నారని, తెలంగాణకు మాత్రం నరసింహనే గవర్నర్‌గా కొనసాగుతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఇరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు వస్తారా లేక నరసింహన్ కొనసాగుతారా అనేది మాత్రం ఇంకా తెలియడంలేదు.