రాజధాని అమరావతి ఉద్యమం.. గుంటూర్ రేంజ్ ఐజీ కీలక ప్రకటన..!

Tuesday, February 25th, 2020, 12:00:50 AM IST

ఏపీ రాజధాని అమరావతి ఉద్యమ ఆందోళనలపై గుంటూరు రేంజ్ ఐజీ బినీత్ బ్రిజీలాల్ కీలక ప్రకటన చేశారు. అయితే రాజధాని ఆందోళనల పేరుతో గత కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు నిరసన కార్యక్రమాలు అంటూ సామాన్య జనానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని ఐజీ ఆరోపించారు.

అయితే ఈ విషయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరిస్తున్నారని కొందరి అండదండలు చూసుకుని నిరసనలు చెలరేగుతున్నాయని రైతుల పేరిట ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ ఘటనలలో పలువురు పోలీసులను కూడా గాయపరుస్తున్నారని, పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తమపై పోలీసులు చేయి చేసుకున్నారంటూ మీడియాకి తప్పుడు వార్తలు అందిస్తున్నారని అన్నారు. అయితే ఈ ఆదివారం దాదాపు ఆరు హింసాత్మక సంఘటనలు జరిగాయని వాటికి కారణమైన పలువురిపై కేసులు నమోదు చేశామని అన్నారు. అయితే నిన్న జరిగిన ఘటనలలో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వెళ్ళే సమయంలో ప్రజలు ఒక్కసారిగా రోడ్ల పైకి వచ్చారని, ఇలాంటి అభద్రతా కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఐజీ ప్రకటన విడుదల చేశారు.