ఇక్క‌డ హ‌రీష్‌..అక్క‌డ రోజా ఇద్ద‌రికి అంతేనా?

Monday, June 10th, 2019, 02:11:19 PM IST

హ‌రీష్‌రావు, రోజా.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో త‌మ మాస్ ఫాలోయింగ్‌తో పాపుల‌ర్ అయిన నేత‌లు. ఎలాంటి సంద‌ర్భంలోనైనా రాణించ‌గ‌ల నేర్ప‌రిత‌త్వం వీరి సొంతం. ఏ టాపిక్ తీసుకున్నా ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించ‌గ‌ల స‌త్తా వీరి సొంతం అయితే వీరికున్న మాస్ ఫాలోయింగే వీరిని రాజ‌కీయంగా వెన‌క‌బ‌డేస్తోంది. అధినేత‌ల చిన్న చూపు కార‌ణంగా వీరికి త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు. తెరాస‌లో సీనియ‌ర్ నేత‌గా జేజేఅందుకున్న హ‌రీష్‌రావుకు ఆ పార్టీలో ప్ర‌స్తుతం స‌రైన ప్రాధాన్య‌త‌న ద‌క్క‌డం లేదు. ప్రాధాన్య‌త ఇస్తే మాస్ లీడ‌ర్ అయిన హ‌రీష్ ఎక్క‌డ త‌మ‌ని దాటేస్తాడోన‌ని గులాబీ బాస్‌కు దిగులు ప‌ట్టుకుంది.

ఆ కార‌ణంగానే అత‌నికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం లేదు. పార్టీలో కేసీఆర్ త‌రువాత‌ నెంబ‌ర్ 2గా వున్న ఆయ‌నకు ఎలాంటి రాజ‌కీయ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం లేదు. గ‌త కొంత కాలంగా సిద్ధిపేట నియోజ‌క వ‌ర్గానికే ప‌రిమితం చేయ‌డం తెరాస‌లోనే కాదు ఇత‌ర పార్టీల్లోనూ, సామాన్య ప్ర‌జ‌ల్లోనూ విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఉద్య‌మ స‌మ‌యంలో కానీ ప‌లువురు కీల‌క నేత‌లు ఇత‌ర పార్టీలను వీడి తెరాస గూటికి చేర‌డంలో కానీ హ‌రీష్ ప్ర‌ధాన భూమిక పోషించారు. అదే హ‌రీష్‌ను పార్టీకి, పార్టీ కార్య‌క‌లాపాల‌కి దూరం చేస్తోంది. ఈ ద‌ఫా మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్క‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఇదే త‌ర‌హాలో పార్టీ అధినేత జ‌గ‌న్ నుంచి ఎదుర్కొంటోంది రోజా. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న రోజా వైసీపీ క‌ష్ట‌కాలంలో వున్న స‌మ‌యంలో అసెంబ్లీలో పార్టీ వాణీని వినిపించి చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించింది. అలాంటి ఆమెను జ‌గ‌న్ కొన్ని కార‌ణాలు చూపిస్తూ మంత్రి ప‌ద‌వికి దూరం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రి జాత‌కాలు చూస్తే ప్ర‌జాభిమానం ఆకాశంలో …పార్టీ అధినేత విశ్వాసం పాతాలంలో అన్న‌ట్టుగా వుందని రాజ‌కీయ విశ్లేష‌కులు చమ‌త్క‌రిస్తున్నారు.