మాపై ఎందుకు నిందలు?

Monday, October 20th, 2014, 12:27:22 PM IST

harish-rao
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఆదివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలపై వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి ఇవ్వడం కాదని, ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఇచ్చి పరిష్కారానికి కృషి చెయ్యాలని భాజపా నేతలకు సూచించారు. అలాగే భాజపా నేతలు కేవలం ప్రచారంతోనే తెరాస ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారని హరీష్ రావు మండిపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నాలుగు నెలలైనా కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పాలన కుంటుపడిందని వివరించారు. అలాగే ప్రధాని మోడీ ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియటం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయకుండా, విద్యుత్ ను సరఫరా చెయ్యని కేంద్రంపై వత్తిడి తేకుండా భాజపా నేతలు ఎందుకు తెరాస ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు.