దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం – 1200 గుడిసెలు దగ్ధం…

Tuesday, May 26th, 2020, 08:17:04 AM IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ భారీ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 1200 గుడిసెలు దగ్దమయ్యాయని సమాచారం. కాగా ఢిల్లీలోని తుగ్లకాబాద్ లో సోమవారం అర్దరాత్రి సమయంలో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ తూర్పు ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలోని మురికివాడలోని గుడిసెలకు సోమవారం అర్దరాత్రి అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున అంటుకున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో 1200 గుడిసెలు దహనమయ్యాయని ఢిల్లీ డీసీపీ రాజేంద్రప్రసాద్ మీనా చెప్పారు. \

అయితే ప్రమాదాన్ని గమనించిన ప్రజలందరూ కూడా ఆ గుడిసెల నుండి హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపుగా 30 అగ్నిమాపక వాహనాలతో వచ్చి తుగ్లకాబాద్ మురికివాడలో మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాల కోసం విచారణ చేపట్టారు. ఇకపోతే ఈ ప్రమాదం కారణముగా నిరాశ్రయులైనటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.