అన్న హీరోయిన్ పైన కన్నేసిన తమ్ముడు

Friday, May 4th, 2018, 06:11:25 PM IST

తనదైన ముద్ర వేసుకుని అన్నయ్య నాగచైతన్య కెరీర్లో ఫుల్లు బిజీగా సినిమాలు చేస్తూ సాగిపోతుంటే… తమ్ముడు అఖిల్ మాత్రం సినిమాల సెలక్షన్లకే ఏళ్లకి ఏళ్లు గడిపేస్తున్నాడు. మొదటి రెండు సినిమాలు ఆశించినంత ఆడకపోవడంతో ముచ్చటగా మూడో సినిమాతోనైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ వంటి మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకీ అట్లూరి… రెండో సినిమాలో అఖిల్‌ని డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బీవీఎన్.ఎస్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా పోయిన నెల్లో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇన్ని రోజులు ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఎంపిక కాలేదు.
అఖిల్ పక్కన ప్రెష్ ఫేస్ కోసం వెతికిన చిత్ర బృందానికి ‘సవ్యసాచి’ చిత్రంలో అన్న నాగచైతన్యతో ఆడిపాడుతున్న నిధి అగర్వాల్ బాగా నచ్చిందట. దాంతో వెంటనే నిధిని అఖిల్‌కి జోడిగా ఎంపిక చేసేశారు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో చేసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రెండో సినిమాను చేజిక్కుచ్చుకోవడం విశేషమే. జూన్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఓ బడా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసి స్టార్ హీరో అయిపోవాలనుకున్న అఖిల్… ఆ ప్రయత్నాలు తేడా కొట్టేయడంతో ఈసారి మాస్ సబ్జెక్టుల జోలికి వెళ్లకుండా తన ఏజ్‌కి సరిపోయేలా ఓ లవ్ స్టోరీ చేసేందుకు నిర్ణయించుకోవడం మంచి పరిణామమే.