యాక్ష‌న్ కింగ్ అర్జున్ వార‌సుడి నిశ్చితార్థం..

Monday, October 23rd, 2017, 04:36:09 PM IST

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ని తెలుగు ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఓ క‌న్న‌డిగ అయినా, తెలుగు, త‌మిళ్‌లో అసాధార‌ణ క్రేజు సంపాదించిన హీరో. ఆల్మోస్ట్ తెలుగు, త‌మిళ భాష‌ల్ని సునాయాసంగా మాట్లాడేస్తాడు. ఎన్నో తెలుగు సినిమాల్లో న‌టించాడు కాబ‌ట్టి తెలుగు భాష పుక్కిట పురాణం లాంటిదే. మా ప‌ల్లెలో గోపాలుడు మొద‌లు.. ఒకే ఒక్క‌డు, జైహింద్ స‌హా ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ అర్జున్ కెరీర్‌లో ఉన్నాయి. మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన అర్జున్ హీరోగా పెద్ద స‌క్సెస‌య్యాడు. అయితే అర్జున్ త‌ర్వాత న‌ట‌వార‌సుడిగా బ‌రిలోకి దిగిన చిరంజీవి షార్జా మాత్రం తండ్రి చాటు బిడ్డ‌గానే కంటిన్యూ అవుతున్నాడు. క‌న్న‌డ‌లో న‌వ‌త‌రం హీరోల్లో ప్ర‌తిభావంతుడిగా కొన‌సాగుతున్నా.. త‌న‌ని తాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో పెద్దంత‌గా ఎలివేట్ చేసుకున్న‌దే లేదు. ఆ క్ర‌మంలోనే అర్జున్ త‌న‌య ఐశ్వ‌ర్య సైతం క‌థానాయిక గా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి ద‌ర్శ‌క‌త్వంలోనే ఐశ్వ‌ర్య నాయిక‌గా న‌టించింది.

అదంతా స‌రే.. చిరంజీవి షార్జా క‌న్న‌డ హీరోయిన్ మేఘ‌నా రాజ్‌తో ప‌దేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాడ‌న్న వార్త‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. నేడు త‌న ప్రేయ‌సితో నిశ్చితార్థం పూర్త‌యింది. అర్జున్ ఫ్యామిలీ స‌హా ఈ కార్య‌క్ర‌మంలో క‌న్న‌డ సినీరంగానికి చెందిన ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అర్జున్‌, అత‌డి భార్య ఆస్రానీ, కుమార్తె ఐశ్వ‌ర్య స‌హా ప్ర‌జ్వ‌ల్‌, దేవ‌రాజ్‌, జ‌గ్గేష్‌, భార‌తీ విష్ణువ‌ర్ధ‌న్‌, సుమ‌ల‌త అంబ‌రీష్ త‌దిత‌రులు ఈ నిశ్చితార్థ వేడుక‌లో పాల్గొని న‌వ జంట‌ను ఆశీర్వ‌దించారు. నిశ్చితార్థం స‌రే.. చిరంజీవి షార్జా యాక్ష‌న్ హీరోగా .. సౌత్ స్టార్ హీరోగా అర్జున్‌కి ధీటైన వాడిగా ఎప్ప‌టికి నిరూపించుకుంటాడో చూడాలి.