చెన్నై ఆస్తులు అమ్మేసిన హీరో రాజ‌శేఖ‌ర్‌

Saturday, October 28th, 2017, 12:05:17 PM IST

సినిమాల కోసం డ‌బ్బులు పోగొట్టుకున్న నిర్మాత‌లెంద‌రినో చూశాం. ఫైనాన్సులు తెచ్చి, తిరిగి అప్పు చెల్లించ‌లేని స‌న్నివేశంలో ఉన్న పెళ్లాం పుస్తెల తాడు స‌హా.. ఆస్తుల‌న్నిటినీ త‌న‌ఖా పెట్టి .. బాకీ చెల్లించే నిర్మాత‌ల్ని చూశాం. అయితే హీరో రాజ‌శేఖ‌ర్‌కి అలాంటి స‌న్నివేశం ఎదురైందా? అంటే అవున‌నే ఆయన చెప్పిన మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. రాజ‌శేఖ‌ర్ గ‌త కొంత‌కాలంగా వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నా అవేవీ హిట్టెక్క‌డం లేదు. అయినా జీవిత‌తో క‌లిసి రాజ‌శేఖ‌ర్ సొంతంగానే ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సినిమాలు తీస్తూనే ఉన్నారు. క‌సిగా హిట్టు కొట్టి తిరిగి త‌న పూర్వ వైభ‌వాన్ని తెచ్చుకునేందుకు చాలా తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. సినీప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మై రాజ‌శేఖ‌ర్ – జీవిత జంట చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ప్ర‌శంసించ‌ద‌గ్గ‌ది. అయితే న‌ష్టాలు వ‌స్తే ఎంత‌టివారికైనా క‌ష్ట‌మే.

నిన్న‌టి సాయంత్రం వేళ `పిఎస్‌వి గ‌రుడవేగ‌` ఆడియో వేడుక‌లో రాజ‌శేఖ‌ర్ వెల్ల‌డించిన నిజాలు నిశ్చేష్టుల్ని చేశాయంటే న‌మ్మండి. ఈ వేడుక‌లో రాజశేఖర్‌ మాట్లాడుతూ-“మా అబ్బాయికి చాలా రోజుల తర్వాత విజయం వ‌స్తోంద‌ని అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మనాన్నలకి బాధ ఏంటంటే నేను బాగా నష్టపోయాననే! చెన్నైలో ఉన్న ఆస్తులు అమ్మి సినిమాలు చేశా. నాకు సరిపడని కొన్ని సినిమాలు చేసి ఇబ్బంది పడ్డా. నాకే బాధ కలిగి ఇక సినిమాలు తీయకూడదు అనుకొని ఇంటి దగ్గర ఉండిపోయా“న‌ని వ్యాఖ్యానించారు. పిఎస్‌వి గ‌రుడ‌వేగ చేసే స‌మ‌యంలో అమ్మను కోల్పోయాను.. త‌ను దూరం కావడంతో నామీద ఓ పెద్ద పిడుగు పడినట్టైంది. ప్రతీక్షణం అమ్మే గుర్తుకొస్తోంది. జీవిత సోదరుడు.. లైన్‌ ప్రొడ్యూసర్‌ మురళి ఆరోగ్యం విష‌య‌మంగా ఉండ‌డంతో అన్నిటినీ దిగ‌మింగుకుని సినిమాకే అంకిత‌మ‌య్యాం“ అని రాజ‌శేఖ‌ర్ చెప్ప‌డం హృద‌యాల్ని ట‌చ్ చేసింది. `పిఎస్‌వి గ‌రుడ‌వేగ‌` చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి కోల్పోయిన ఆస్తులన్నీ తిరిగి సాధించాల‌ని ఆశిద్దాం.