బార్లు, పబ్‌లపై ఆంక్షలు ఉండవా.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్..!

Tuesday, April 6th, 2021, 03:34:40 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తిపై నేడు మరోసారి హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా కేసుల నియంత్రణ, టెస్టులకు సంబంధించి ప్రభుత్వం నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదికపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు, థియేటర్లు, బార్లు, పబ్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని ఆదేశించింది. టెస్టుల విషయంలో ర్యాపిడ్ టెస్టులే ఎక్కువగా చేస్తున్నారని, ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది.

అయితే పరీక్షల సంఖ్యను నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వొకేట్ జనరల్ చెప్పడాన్ని కూడా హైకోర్ట్ తెప్పుపట్టింది. ఓ పక్క కరోనా కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తుంటే పరీక్షలను నెమ్మదిగా పెంచడమేంటని ప్రశ్నించింది. ఇకనైనా ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగంగా పెంచాలని స్పష్టం చేసింది. ఇకపోతే పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని, కరోనా పాజిటివ్ కేసులు, మరణాల రేటు స్పష్టంగా వెల్లడించాలని హైకోర్టు పేర్కొంది.