కేసీఆర్ సర్కార్‌కి హైకోర్ట్ మరో డెడ్‌లైన్.. చర్చలు జరగాల్సిందే..!

Friday, October 18th, 2019, 05:28:36 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రస్తుతం 14వ రోజుకు చేరుకుంది. అయితే అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని ఇక తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని త్వరలో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని మొండి వైకరి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సమ్మెపై వెనక్కి తగ్గని కార్మికులు సమ్మెను మరింత ఉదృత్తం చేశారు. ఇటీవల సమ్మెపై హైకోర్ట్‌లో జరిగిన వాదనలో అటు ప్రభుత్వానికి, ఇటు కార్మికులకు చర్చలు జరుపుకుని సమ్మెను విరమించుకోవాలని, ఆర్టీసీకి తక్షణమే ఎండీనీ నియమించాలని ఆదేశాలు ఇస్తూ కోర్ట్ విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే నేడు ఇరువైపుల వాదనలు మరో సారి విన్న హైకోర్ట్ ప్రభుత్వ వైఖరిపై సీరియస్ అయ్యింది. ఎండీనీ నియమించాలని చెప్పినా ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్దమేనని ఆర్టీసీ యూనియన్లు మరోసారి కోర్ట్‌కు తెలిపాయి. అయితే మరో మూడు రోజులలో చర్చలు పూర్తి చేయాలని, ప్రభుత్వ నిర్ణయాలను కోర్ట్‌కి తెలపాలంటూ డెడ్‌లైన్ ప్రకటించింది.