ఆర్టీసీ కార్మికులకు షాక్.. రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..!

Friday, November 22nd, 2019, 07:22:29 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు దాదాపు 50 రోజులుగా సమ్మెను చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా ఈ కేసును హైకోర్ట్ లేబర్ కోర్ట్‌కి పంపడంతో కార్మికులు సమ్మెను విరమించేందుకు సిద్దమయ్యారు. అయితే ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధులలో చేర్చుకోవాలని అప్పుడే తాము తిరిగి విధులలో చేరుతామని అన్నారు. అయితే దీనిపై మాత్రం ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే తాజాగా ఆర్టీసీ కార్మికులకు మరో పెద్ద షాక్ తగిలింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు తీసుకోవడానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ వాదనలను విన్న తరువాత తాము కేబినెట్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 102 ప్రకారం ప్రభుత్వానికి ఆ అధికారాలున్నాయని, ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని ఏజీ స్పష్టం చేశారు.