వైసీపీలో హాట్ టాఫిక్.. నమ్మిన బంటును పక్కన పెట్టిన సీఎం జగన్..!

Sunday, August 18th, 2019, 06:45:38 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే జగన్ మంత్రివర్గంలో చాలా మంది నేతలు చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా కొన్ని సామాజిక కారణాల నేపధ్యంలో జగన్ హామీ ఇచ్చిన వారికి కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయితే అలా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు జగన్.

అయితే పార్టీనే నమ్ముకుని, మొదటి నుంచి జగన్ వెంటే ఉన్న ఆ నేతను మాత్రం పూర్తిగా మరిచిపోయారంటూ ఇప్పుడు పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఉరవకొండ నుంచి 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి విజయం సాధించిన విశ్వేశ్వర రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీనీ వీడి వైసీపీలో చేరారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈయన ఆ తరువాత వైసీపీలో చేరి ఉరవకొండలో వైసీపీ పార్టీనీ బలోపేతం చేశారు. అంతేకాదు జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట ఉన్న నేతలలో విశ్వేశ్వర రెడ్డి కూడా ఒకరు. అయితే ఈ సారి ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి లభిస్తుందని పార్టీలో అందరూ అనుకున్నారు. అయితే వైసీపీ భారీ విజయన్ని నమోదు చేసుకుంటే విశ్వేశ్వర రెడ్డి మాత్రం ఈ సారి స్వల్ఫ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అయితే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అయినా కట్టబెడతారని అనుకున్నా అది కూడా దక్కలేదు. ఇక కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా విశ్వేశ్వర రెడ్డికి లభించకపోవడంతో పార్టీలో నమ్ముకున్న వ్యక్తులకు చోటు దక్కడంలేదని, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వలసదారులకు పదవులు లభిస్తున్నాయన్న అంశంపై ప్రస్తుతం పార్టీలో చర్చలు నడుస్తున్నాయట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విశ్వేశ్వర రెడ్డి మాత్రం వైసీపీ వీడలేదు. అయితే పార్టీ కోసం కష్టపడిన విశ్వేశ్వర రెడ్డికి మున్ముందైనా జగన్ అవకాశాలు కల్పిస్తారా లేక పూర్తిగా పక్కకి పెడతారా అనేదే పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది.