అవినీతి తిమింగ‌లాలు వ‌ల‌కు చిక్కుతోందెలా?

Saturday, October 14th, 2017, 10:11:24 AM IST

రోజుకో భారీ అవినీతి తిమింగ‌లం ఏసీబి వ‌ల‌కు చిక్కుతున్న వైనం తెలిసిందే. మండ‌ల కేంద్రం, జిల్లా కేంద్రం, రాష్ట్రం, దేశం ఇలా అన్నిచోట్లా వెతికితే నిరంత‌రాయంగా వంద‌లాది తిమింగ‌ళాలు ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌ వ‌ల‌కు చిక్కుతున్నాయి. అయితే వీళ్లంతా ఎలా దొరుకుతున్నారు? అంటే దానికి అదిరిపోయే ఫార్ములా ఉండ‌నే ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

పెద్దనోట్ల రద్దు.. నగదు లావాదేవీలపై ఆంక్షలు.. డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహకాలు.. వంటి చ‌ర్య‌ల‌తో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అట్టుడికిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు ఏ తీరుగా సాగుతున్నాయో అధికారుల గుప్పిట్లోకి తెచ్చే వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేశారు. బ్యాంక్ లావాదేవీలు, కొనుగోళ్లు జ‌రిపే మాల్స్ నుంచి, నిత‌ర‌త్రా లావాదేవీలు సాగే చోట్ల నుంచి, ప్రాప‌ర్టీ కొనుగోళ్ల నుంచి.. ప్ర‌తి చోట నుంచి ఏమేం జ‌రుగుతోందో ప్ర‌తిదీ ప‌క్కాగా ఓ వ్య‌వ‌స్థ‌కు అనుసంధానం చేశారు. అందువ‌ల్ల అక్ర‌మార్జన‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చు చేసేవాళ్లంతా అడ్డంగా దొరికిపోతున్నారు. బంగారం, వ‌జ్రాల కొనుగోళ్లు, విదేశాల్లో ల‌గ్జ‌రీ లైప్ ఎంజాయ్ చేయ‌డాలు.. ఇలా ఎవ‌రేం చేస్తున్నారో ప్ర‌తిదీ నిఘా నీడ‌లోనే.. అవినీతిప‌రులకు తెలియ‌కుండా గూఢాచారులు వెంటాడుతూనే ఉంటారు. ఆఫీస్, ఇల్లు, షాపు ఎక్క‌డ ఉన్నా.. వీళ్ల‌పై ఆరాలు తీస్తూనే ఉంటారు. ఇప్ప‌టికే ఆదాయం బాగా ఆర్జించే, అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డే అధికారులు, బ‌డా బాబుల లిస్టు మోదీ స‌హా ఇంటెలిజెన్స్ అధికారుల చెంత ఉంది. అందులో ఎవ‌రేం చేస్తున్నారు? అన్న నిఘా నిరంత‌రాయంగా కొన‌సాగుతుంది. అలా ఏదో ఒక‌చోట స‌ద‌రు తిమింగ‌ళాలు అడ్డంగా దొరికిపోతున్నాయ్‌. ఒక పెద్ద షార్క్‌ని ప‌ట్టే ముందు చేప‌ల వేట‌గాడు వ‌ల ప‌న్నేందుకు ఎన్ని యుక్తులు ఉప‌యోగిస్తాడో, అంత‌కుమించిన ప‌న్నాగాల‌తో ఏసీబీ అధికారులు ట్రాప్‌లో వేస్తున్నారు. పిల్లి పాలు తాగుతూ త‌న‌ని ఎవ‌రూ చూడ‌లేదు అనుకుంటుంది. అదే తీరుగా ఉండే అవినీతి బాబులు అడ్డంగా బుక్క‌యిపోతున్నార‌న్న‌ది ఏసీబీ నివేద‌న‌. ఏదీ దాచుకునే సినిమా లేదిప్పుడు.