ట్రైల‌ర్ టాక్‌: ప్రేమికుల్ని క‌లిపే `హౌరా బ్రిడ్జ్‌`

Friday, October 13th, 2017, 09:28:27 AM IST

యూట్యూబ్ బ్యూటీగా పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న చాందిని చౌద‌రి క‌థానాయిక‌గా న‌టించిన `హౌరా బ్రిడ్జ్‌` త్వ‌ర‌లో రిలీజ్‌కి రానుంది. ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్ క‌థానాయ‌కుడు. మనాలీ రాథోడ్ కీల‌క‌పాత్ర‌ధారి. తాజాగా `హౌరాబ్రిడ్జ్‌` ట్రైలర్‌ విడుదలైంది. ఇదో చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్రం. ప్రేమికుల్ని గోడ విడ‌దీస్తుంది.. బ్రిడ్జి క‌లుపుతుంది.. అనే సింగిల్ లైన్‌తో తెర‌కెక్కిన ఆస‌క్తిక‌ర చిత్ర‌మిది.

రాహుల్ ర‌వీంద్ర‌న్‌, చాందిని ఇద్ద‌రికీ ఈ సినిమా విజ‌యం అత్యంత కీల‌కం. ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా విజువ‌ల్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌న‌డానికి ఈ ట్రైల‌ర్ చాలు. ఇదో ట్రాజిక్ ల‌వ్‌స్టోరి అని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది. అయితే హౌరా బ్రిడ్జికి ఈ ప్రేమికులకు ఉన్న లింకేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ చిత్రంలో రావు రమేశ్‌, అజయ్‌, అలీ, ప్రభాస్‌ శ్రీను, విద్యుల్లేఖ రామన్‌, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీవన్‌ యధు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.