లెక్కల మాష్టారుగా హృతిక్ !

Tuesday, February 6th, 2018, 04:14:09 PM IST

తన మొదటి చిత్రం కహో నా ప్యార్ హాయ్ తో యువత మదిలో చెరగని ముద్ర వేసిన హృతిక్ రోషన్, ఆ తర్వాత అంతటి గొప్ప విజయం అందుకోలేదనే చెప్పాలి. అయితే ధూమ్-2 లో హృతిక్ నటనకు, స్టైల్ కు ఫిదా అవ్వని వారుండరు అనే రీతిలో ఆయన నటించారు. అయితే హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇటీవలి ఆయన అంధుడిగా నటించిన కాబిల్ చిత్రం విమర్శకుల ప్రసంశలు అందుకుంది. అయితే ప్రస్తుతం ఆయన ఎందరో జీవితాల్లో వెలుగును నింపిన బీహార్ కు చెందిన లెక్కల మాష్టారు ఆనంద్ కుమార్ జీవిత గాథ లో నటిస్తున్నారు. సూపర్ 30 పేరుతో చిత్రీకరించబడుతున్న ఈ చిత్రం లోని హృతిక్ లుక్ నేటి ఉదయం విడుదలయింది. బాగా గుబురుగా మెరిసిన గడ్డంతో ఒక మధ్యతరగతి వ్యక్తిలా హృతిక్ ఈ ఫోటో లో కనిపిస్తున్నారు.

చాలెంజింగ్ రోల్స్ లో నటించడం హృతిక్ కి కోత్తేమి కాదని చెప్పాలి. ఆయన ఇదివరకు కోయి మిల్గయ, క్రిష్, గుజారిష్, కాబిల్ వంటి చిత్రాల్లో అయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అసలు ఎవరీ ఆనంద్ కుమార్ అని అనుకుంటున్నారా..! పాట్నా వాస్తవ్యులైన ఆనంద్ కుమార్ తండ్రి పోస్టల్ డిపార్ట్ మెంట్ లో క్లర్క్ గా పని చేసేవారు. చిన్నతనంలోనే అప్పడాలు అమ్ముతూ కుటుంబానికి తన వంతు సాయం చేస్తూ మరోవైపు పిల్లలకు లెక్కల పాఠాలు చెబుతూ విదేశీ పత్రికల్లో వచ్చే మ్యాథ్స్ ఆర్టికల్స్ చదవడం కోసం ప్రతివారం పూణే నుంచి వారణాసి దాకా ఆరు గంటల రైలు ప్రయాణం చేసి వాటిని చదివి వచ్చేవారు లెక్కల మాష్టారు ఆనంద్ కుమార్. వెనుకబడిన తరగతుల వారి కుటుంబం లోని పిల్లలకు చదువు చెప్పడమే ధ్యేయంగా తాను 2002లో మొదలు పెట్టిన సూపర్ 30 ప్రోగ్రాం ద్వారా అటువంటి వారిని అక్కున చేర్చుకుని విద్య నేర్పి తీర్చిదిద్దేవారు. ఆలా ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు ఆయన.

నెలకు లక్షలకు లక్షలు జీతాలు ఇస్తామని కార్పోరేట్ విద్యా సంస్థలు రెడ్ కార్పెట్ పరిచినా వాటిని లెక్క చేయకుండా, అలానే పెద్ద పెద్ద మంత్రులు తమ పిల్లలకు చదువు చెప్పడానికి కోట్లు గుమ్మరిస్తామన్నా వాటిని సున్నితంగా తిరస్కరించారు ఆనంద్ కుమార్. ప్రధాని మోడీ నుండి చాలా మంది ప్రముఖుల నుండి ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆనంద్. ప్రస్తుతం అంతటి గొప్ప వ్యక్తి పాత్రలో హృతిక్ రోషన్ ను చూడటం అంటే చిన్న విషయం కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు….