బాబోయ్..నెల్లూరులో బాహుబలి 2 భీభత్సం..!

Friday, February 10th, 2017, 02:00:56 PM IST


బాహుబలి..భారత చలన చిత్ర చరిత్రలో ఇది సంచలనాలకు కేంద్ర బిందువు. ఒక ప్రాంతీయ చిత్రం కానీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో రూపొందడం అదేస్థాయిలో వసూళ్లను రాబట్టడం నిజంగా అద్భుతమే. ఇదంతా రాజమౌలి విజన్,దర్శక ప్రతిభకు ప్రతిఫలమే. కాగా ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రూ 500 కోట్ల వరకూ జరుగుతోందని సమాచారం. కాగా నెల్లూరులో బాహుబలి చిత్రం రూ 4.5 కోట్ల వరకూ వసూలు చేసింది.

బాహుబలి 2 చిత్రానికి సంబంధించి థియేట్రికల్ రైట్స్ నెల్లూరులో అందరు ముక్కున వేలేసుకునేలా రూ 5.6 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలు నెల్లూరులో బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిస్తే రూ 2 నుంచి 2.5 కోట్లవరకూ వసూలు చేస్తాయి. శ్రీమంతుడు, సరైనోడు, ఖైదీ నెం 150 వంటి చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇక బాహుబలి చిత్రం భారీ అంచనాలతో, హంగులతో విడుదలై రూ 4.5 కోట్లవరకు వసూలు చేసింది. ఈ తరుణంలో డిస్ట్రిబ్యూటర్ బాహుబలి 2 హక్కులను రూ 5.6 కోట్లు పెట్టి కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ప్రచార ఖర్చులు వగైరా కలుపుకుంటే 6 కోట్లు దాటిపోతుందని అంటున్నారు. పంపిణీదారుడు గట్టున పడాలంటే బాహుబలి2 నెల్లూరులో రూ 6 కోట్లకు పైనే వసూలు చేయాల్సి ఉంటుంది. ఎంత బాహుబలి చిత్రమైనా ఈ స్థాయిలో రేటుపలకడంపై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం రాజమౌళి బాహుబలిని మించేలా బాహుబలి 2 ని తీర్చిదిద్ది ఉంటాడని వసూళ్లు కూడా బహుబలి ని మించేలా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.