జ‌న్‌ధ‌న్‌ అకౌంట్ల‌లోకి ల‌క్ష‌ కోట్లు .. ఎక్క‌డినుంచొచ్చింది?

Saturday, November 26th, 2016, 12:33:29 PM IST

money
జీరో బ్యాలెన్స్‌తో వెల‌వెల పోవాల్సిన జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల్లోకి వేల కోట్లు వ‌చ్చి ప‌డుతుండ‌డం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కొచ్చింది. ఉన్న‌ట్టుండి పేద‌ల అకౌంట్ల‌లో వేల కోట్లు ఎలా వ‌చ్చి చేరింది? నాలుగు రోజుల క్రితం 25 వేల కోట్లు చేరిందంటే అబ్బో అన్నారు. కేవ‌లం 9 రోజుల్లోనే ల‌క్ష కోట్లు వ‌చ్చి చేరబోతోంద‌ని తాజా రిపోర్ట్ అందింది. జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో అత్య‌ధిక మొత్తం క్రెడిట్ అయిన రాష్ట్రంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ నంబ‌ర్ -1 స్థానంలో నిలిచింది.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాళ్‌, రాజ‌స్థాన్ టాప్ -3 పొజిష‌న్‌లో ఉన్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఖంగు తిన్న రాజ‌కీయ నేత‌లంతా జ‌న్‌ధ‌న్ ఖాతాల్లోకి త‌మ డ‌బ్బును చేర‌వేశారు. పేద‌ల పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి బినామీలుగా వాడుకుంటున్నార‌న్న నిజం బ‌య‌ట‌ప‌డుతోంది. పైగా ఉత్త‌రాది రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల దృష్ట్యా రాజ‌కీయ నాయుకులే స్వ‌యంగా జ‌న్‌ధ‌న్ ఖాతాలు తెరిపించి ఇలా న‌ల్ల డ‌బ్బును జ‌మ చేయించార‌ని చెబుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ జ‌న్‌ధ‌న్ ఖాతాల్లోకి వంద‌ల కోట్లు వ‌చ్చి చేర‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. దీనివెన‌క అటు బ్యాంకు ఉద్యోగుల‌తో పాటు ప‌లువురు హైలెవల్ మ‌నుషులు న‌డిపిస్తున్న తెలివైన దందాగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ మొత్తంపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిపించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం.