నెట్ వాడకం లో పడి వంట చేయలేదని భార్యని హత్య చేసిన భర్త!

Saturday, January 27th, 2018, 10:35:55 PM IST

ఇటీవల ఇంటర్నెట్ వాడకం చాలా ఎక్కువైందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్, మరియు డేటా సేవలు రోజు రోజుకు తగ్గుతుండడం దీనికి ప్రధాన కారణం. అతిగా నెట్ వినియోగం వల్ల మనకి చాలా విషయాల్లో ఉపయోగమున్నా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయనేది వాస్తవం. అయితే అతిగా మొబైల్, ఇంటర్నెట్ వినియోగం సరి కాదని అది మన మెదడుకు కొంత ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు. రోజు పేస్ బుక్ లోనో, ట్విట్టర్ లోనో, వాట్సాప్ లోనో వచ్చే గుడ్ మార్నింగ్ మెసేజ్ చదవనిదే ఇప్పుడు మన డే మొదలు కావడం లేదు. అయితే అతిగా నెట్ వినియోగిస్తూ, కనీసం వంట కూడా చేయకుండా సోషల్ మీడియా లోనే లోకం గడుపుతున్న భార్యని హత్య చేసాడు ఒక భర్త. పోలీస్ లు చెపుతున్న కథనం ప్రకారం కోల్ కతా లోని అలీపూర్ లో నివాసముంటున్న సురజిత్ పాల్ రోజు లానే ఈ నెల 24న తన పని నుండి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. అయితే అప్పటికే వంట చేయకుండా ఇంటర్నెట్ వాడకం లో బిజీగా వున్న తన భార్య తుంపాపాల్ ను చూసి అమిత ఆవేశం తెచ్చుకున్న అతను ఆమెను అక్కడ వున్న కత్తితో ఆమె తలపై దాడి చేసి, తర్వాత టవల్ తో ఊపిరాడకుండా చేసి చంపాడు. తర్వాత తాను ఆత్మహత్య కు యత్నించి మణికట్టు కోసుకున్నాడు, అయితే ఎక్కడ ప్రాణాలు పోతాయో అని భయపడ్డ అతను గాయానికి బ్యాండేజ్ వేసుకుని పారిపోతుండగా పోలీస్ లు అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు వున్నారు. హత్య జరిగిన సమయంలో ఒక కుమారుడు ఊరు వెళ్లగా, మరొక కుమారుడు కళాశాలకు వెళ్లాడు. కళాశాల నుండి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు శవమై పడివున్న తల్లిని చూసి స్థానికులకు సమాచారమందించాడు. స్థానికుల సమాచారంతో సురజిత్ పాల్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు.కాబట్టి ఇంటర్నెట్ వాడకం ఒక పరిధి వరకు బాగుంటుందని, ముఖ్య అవసరాలను సైతం విడిచి వాటిపైనే అస్తమానం దృష్టి కేంద్రీకరించడం వీలైనంతవరకు తగ్గిస్తే మంచిదని నిపుణులు అంటున్నారు…..