టిక్ టాక్ వ్య‌స‌నం: భార్యను దారుణంగా చంపిన భర్త

Sunday, June 2nd, 2019, 07:08:24 PM IST

టిక్ టాక్ ప్ర‌స్తుతం ఎంత దారుణ‌మైన వ్య‌స‌నంగా మారిందో తెలిసిందే. ఈ వ్య‌స‌నానికి బానిస‌లై జీవితాల్ని ఫోన్ కే అంకిత‌మిస్తున్నారు. ముఖ్యంగా యువ‌త‌రంతో పాటు గృహిణులు టిక్ టాక్ బాదితులే. ఈ వ్య‌స‌నం ఏకంగా ఓ నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. మొన్నన ప‌బ్ -జీ వీడియో గేమ్ ఓ టీనేజీ కుర్రాడి ప్రాణం తీసింద‌ని వార్త‌లొచ్చాయి. తాజాగా టిక్ టాక్ ఓ ఇల్లాలి దుర్మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. టిక్ టాక్ ప‌ర్య‌వ‌సానం ఎంత దారుణంగా ఉందో తెలియాలంటే ఈ హ‌త్యోదంతం గురించి చ‌ద‌వాల్సిందే.

తమిళనాడు కోవై సమీపంలో అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్‌ (35) బిల్డింగ్ కాంట్రాక్ట‌ర్. అత‌డి భార్య నందిని(28) స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చ‌ర‌ర్. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కుటుంబ తగాదాల కారణంగా కనకరాజు- నందిని రెండేళ్లుగా ఒక‌రి నుంచి ఒక‌రు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నందిని కొన్ని నెలలుగా టిక్‌టాక్‌కు బానిసై ఆన్ లైన్ లో వీడియోలతో కాల‌క్షేపం చేయ‌డం .. ఆ క్ర‌మంలోనే త‌న‌ను ఫాలో అయ్యేవాళ్లు పెర‌గంతో అస‌లు ముప్పు మొద‌లైంది. ఈ వ్య‌స‌నానికి భర్త అడ్డు చెప్పారు. వచ్చి బుద్ధిగా కాపురం చేయాలని కోరాడు. అయితే భర్త మాటలను పట్టించుకోకుండా ఆమె టిక్ టాక్ వీడియోల‌ను అప్ లోడ్ చేయ‌డంతో ఆగ్ర‌హించిన భ‌ర్త మ‌ద్యం సేవించి నేరుగా కాలేజ్ కి వ‌చ్చాడు. భార్య‌కు ఫోన్ చేస్తున్నా బిజీ అని వ‌స్తుండ‌డంతో ఆ కోపంలో నేరుగా క్లాస్ రూమ్ కే వెళ్లి క‌త్తితో పొడిచేశాడు. ఘ‌ట‌న జ‌రిగిన చోట‌నే నందిని మ‌ర‌ణించారు. త‌న‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కనకరాజ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. టిక్ టాక్ ని నిషేధించాల‌ని ఇప్ప‌టికే డిమాండ్ ఉంది. అయితే ప్ర‌భుత్వాలు ఎందుక‌నో ఇంకా తాత్సారం చేస్తున్నాయి. దీంతో జ‌నం ఇలా బానిస‌లై దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు.