హైదరాబాద్ – ఏపీ.. విమాన ధరలు ఎంతో తెలిస్తే షాక్!

Saturday, January 13th, 2018, 08:52:02 PM IST

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా జరుపుకునే సంక్రాంతి కోసం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఆంధ్రా లోని సొంత గూటికి చేరుకుంటున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనీ అన్ని పనులకు సెలవులు పెట్టేశారు. అయితే హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే కొన్ని బస్సులు ట్రైన్లు ఫుల్ అవుతున్నాయి. ఎప్పుడో వారం కిందట బుక్ చేసుకున్న వారు ఇప్పుడు హ్యాపీగా వెళుతున్నారు. ట్రైన్లు కూడా చాలా వరకు ఫుల్ అయ్యాయి. అయితే కొంత మంది మాత్రం విమానాల ద్వారా సొంత గూటికి చేరుకుంటున్నారు.

హైదరాబాద్‌ నుంచి విశాఖకు, రాజమహేంద్రవరంకి అలాగే విజయవాడకు స్పెషల్ విమానాలు నడుస్తున్నాయి. మొదట దసరా అఫర్ గా తక్కువ ధరకే ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ సంక్రాంతి ఫెస్టివల్ ని ఏ మాత్రం మిస్ చేసుకోకూడదని మూడు నాలుగు వేలు ఉన్న విమాన చార్జీలను ఏకంగా రూ.15 వేల వరకు పెంచేశారు. ఈ ఖర్చుతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలోనే రెండు ట్రిప్పులు వేయొచ్చు. ఎందుకంటే ఢిల్లీకి టికెట్టు ధర రూ.3,500 మాత్రమే. శుక్రవారం హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లాలంటే టికెట్ విలువ రూ.18 వేలు. ఇక రాజమహేంద్రవరంకి రూ.16,373 పలుకగా.. విజయవాడకు రూ.12,931లు టిక్కెట్‌ ధర పలికింది. ఇక శనివారం కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ధర ఎంత ఉన్నా కొన్ని ధనిక కుటుంబాలు చార్జీలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఎంత ఉన్నా సరే సీట్లు దొరికితే చాలు వెంటనే బుక్ చేసేస్తున్నారు. దీంతో విమాన సంస్థలకు లాభాలు అందుతున్నాయి.