నా ఇల్లు అమ్మేసి కరెంట్ బిల్ చెల్లించుకొండి…అధికారులకు అంబర్ పేట్ వాసి ఆఫర్!

Wednesday, July 29th, 2020, 12:46:34 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అన్ లాక్ డౌన్ ప్రక్రియ నడుస్తోంది. అయితే లాక్ డౌన్ దాదాపు నాలుగు నెలల కాలం లో కరెంట్ బిల్ ఇచ్చేందుకు అధికారులు ఎవరు రాలేదు. హైదరాబాద్ లాంటి మహా నగరం లో ఇపుడిపుడే అధికారులు ఇళ్ళకి వెళ్లి కరెంట్ బిల్స్ ను అందజేస్తున్నారు. అయితే అంబర్ పేట లో ఉంటున్న వీరబాబు అనే వ్యక్తికి ఆరు లక్షలకు పైగా కరెంట్ బిల్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

నాలుగు నెలల కరెంట్ బిల్ ఒక్కసారిగా 6.67 లక్షల రూపాయల రావడం తో వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిని అమ్మి కరెంట్ బిల్ చెల్లించుకోవాలని, మిగిలిన డబ్బుని తనకు ఇవ్వండి అని కోరారు. తనకు ఆధార్ కార్డ్, లేబర్ కార్డ్ అన్ని ఉన్నా బ్యాంక్ నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు అంటూ అవేదన వ్యక్తం చేశారు. అంతేకాక తనకు ఎలాంటి ఉద్యోగం లేదు అని, ఏదైనా పని చేద్దాం అంటే దొరకడం లేదు అని, ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు సైతం సొంత ఊళ్లకు వెళ్లిపోయారు అని, అయిదు నెలల నుండి అద్దె రావడం లేదని వాపోయారు. తాజాగా పలు చోట్ల భారీగా కరెంట్ బిల్ లు రావడం తో కొందరు షాక్ కి గురి కాగా, ఈ సారి మాత్రం ఒక సామాన్యునికి ఆరు లక్షలకు పైగా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.