నాకు ఇంకా పిలుపు రాలేదు : జూనియర్ ఎన్టీఆర్

Tuesday, April 3rd, 2018, 08:40:40 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికులు త్రివిక్రమ్ దర్శకత్వం లో త్వరలో కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని హారిక హసినీ క్రేయేషన్స్ పతాకం పై రాధా కృష్ణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడి తన బాడీని మంచి షేప్ కి బిల్డ్ అప్ చేసారు. నేడు ఐపీఎల్ తెలుగు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయనని చూసిన వారందరు సూపర్ గా వున్నారని కితాబిస్తున్నారు. అయితే తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఈ విధంగా క్రికెట్ లో తాను కూడా భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

అయితే ఈ సందర్భంగా ఒక విలేఖరి ఇటీవల మీ బాబాయ్ గారి తో ఎన్టీఆర్ బయో పిక్ తెరకెక్కుతోంది కదా, అందులో మీరు ఏదైనా పాత్ర చేస్తున్నారా అని అడగ్గా. దానికి ఆయన బదులిస్తూ తెలుగు ప్రజలందరి ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు గారి బయో పిక్ లో నటించడం అంటే అది సామాన్యంగా దొరికే అదృష్టం కాదని, అయితే తనకు ఇంతవరకు ఆ యూనిట్ నుండి పిలుపు రాలేదని, వస్తే మాత్రం అది ఎటువంటి పాత్ర అయినా తప్పక చేస్తానని ఆయన అన్నారు. కాగా ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది, పూజ హెగ్డే ని ఇందులో హీరోయిన్ గా ఎంపిక చేసారు…..