రాజకీయాల్లోకి అస్సలు రాను : ప్రముఖ నటుడు

Friday, April 13th, 2018, 04:08:13 PM IST

గతంలో పలు విజయవంతమయిన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అప్పటి నటుల్లో జగపతి బాబు ఒకరు. ప్రముఖ సీనియర్ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ కుమారుడు అయిన ఆయన, సింహస్వప్నం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆతరువాత మంచి ఫామిలీ హీరోగా పేరు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన విలన్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే నేడు ఒక ప్రైవేట్ కార్యక్రమం లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామం విచ్చేసిన ఆయన అక్కడ విలేఖర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో టాలీవుడ్ పరిశ్రమ మౌనంగా లేదని, కాకపోతే వచ్చినపుడు అందరూ మాట్లాడతారని స్పష్టం చేసారు.

తనకి రాజకీయాలపై ఆసక్తి లేదని, అసలు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రానని ఆయన అన్నారు. ఇదివరకు పలువురు రాజకీయనాయకులు తనని రమ్మని బలవంతం చేసినప్పటికీ తనకి ఇష్టం లేదని వారికి తేల్చిచెప్పానని అన్నారు. ప్రస్తుతం విలన్ పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న ఆయన ఎటువంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధమన్నారు. అంతే కాదు పాత్ర యొక్క డిమాండ్ ని బట్టి అవసరం అయితే తాను గుండు కూడా చేయించుకుని సహజంగా నటించడానికి సిద్ధమని అన్నారు…..