నా ఫోన్ లో సిమ్ కార్డు లేదు : ప్రియా ప్రకాష్ వారియర్

Monday, March 12th, 2018, 03:06:10 PM IST

కళ్ళతో పలికించిన హావభావాలతో అందరి చూపు తనవైపు తిప్పుకున్న చిన్నది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ ఒక్క వీడియో తో ఆమె సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, అలానే అన్ని ప్రముఖ జాతీయ చానెళ్లు ఆమె ఇంటర్వ్యూ కోసం తహతహ లాడుతున్నాయి. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఒక ఆశ్చర్యకర విషయం చెప్పారు. తనకు ఫోన్ ఉంది కానీ అందులో సిమ్ లేదని ప్రియా తెలిపింది. ఈ సందర్భంగా తన గురించిన పలు విశేషాలు ఆంగ్ల పత్రికతో పంచుకుంది. కాలేజీకి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చని భావించానని, కానీ విమలా కళాశాలలో నిబంధనలు కఠినంగా ఉండేవని చెప్పారు.

కాలేజీలో మోడ్రన్ దుస్తులు వేసుకోకూడదు, మొబైల్స్‌ తీసుకెళ్లకూడదని చెప్పింది. ‘ప్రింగిల్స్‌’, ‘వన్‌ ప్లస్‌’, ‘హిప్‌ స్టర్‌’ వంటి బ్రాండ్లకు తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ లు పెట్టినందుకు ఒక్కో పోస్టుకి 5 లక్షల రూపాయల పారితోషికం లభించిందని తెలిపింది. తన తొలి విమాన ప్రయాణం ఈ మధ్యే జరిగిందని, మాదకద్రవ్యాల నివారణ క్యాంపెయిన్‌ నిమిత్తం కొచ్చి నుంచి త్రివేండ్రంకు విమానంలో వెళ్లడమే తన తొలి విమానప్రయాణమని ప్రియా ప్రకాశ్ వారియర్ వెల్లడించింది. తాను వన్ ప్లస్ మొబైల్ కి బ్రాండింగ్ చేయడంతో తన వద్ద వన్ ప్లస్ మొబైల్ ఉందని, కానీ అందులో సిమ్ లేదని చెప్పింది.

తనను ఇప్పటికీ ఇంట్లో ఫోన్‌ వాడనివ్వరని తెలిపింది. మరీ అవసరమైతే తన తల్లి ఫోన్ వాడుతుంటానని చెప్పింది. ఇంట్లో హాట్ స్పాట్ ఆన్ చేసి ఉంటే, తన ఫోన్ వాడుతానని వెల్లడించింది. చిన్నప్పుడు దుస్తుల విషయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేదాన్ని. అప్పుడు మా అంకుల్‌ ఒకరు నువ్వు చూడడానికి మోడల్‌లా ఉన్నావ్‌ అన్నారు. ఆ మాటలు నా బుర్రలో పాతుకుపోయాయి. మోడల్‌ ఎందుకు కాకూడదు, ఆ తర్వాత నటి ఎందుకు కాకూడదు అని అనుకున్నా. సీఏ పరీక్షలు రాసేకంటే సినిమా రంగంలో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. అలా అనుకోకుండా ఒరు అదార్‌ లవ్‌ ఆడిషన్స్‌కు వెళ్లాను. కంగారుతో ఆడిషన్స్‌ సరిగ్గా ఇవ్వలేకపోయాను. దాంతో నన్ను ఓ చిన్న పాత్రకు ఎంపికచేశారు. కానీ పాటలో నేను పలికించిన హావభావాలతో నా పంట పండింది. సినిమాలో నన్ను ఐదుగురు హీరోయిన్‌లలో ఒకరిగా ఎంపికచేశారు అని ఆమె చెప్పుకొచ్చారు….