ఆ చిత్రంలో నటించే సమయంలో ప్రాణాలు కోల్పోయేదాన్ని : కంగనా

Friday, March 2nd, 2018, 05:33:14 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం మణికర్ణిక. క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సి లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని తొలి భాగం చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికేనర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా కారణంగా తన ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చేదని అంటున్నారు కంగన.

కథానుసారం యుద్ధం నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి, ఈ పాత్ర నాకు ఛాలెంజ్‌తో కూడుకున్నది. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. వాటివల్ల ఎన్నో ప్రమాదాలకు గరయ్యాను. ఒకానొక సందర్భంలో ఈ పాత్ర చేస్తూ దాదాపు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థతి ఎదురైంది అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథని అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో లక్ష్మీబాయి పాత్రను తప్పుగా చూపిస్తున్నారంటూ గతంలో పలు బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో చిత్రబృందం తగు వివరణ ఇవ్వగా వారు ఆందోళనలు విరమించుకున్నారు. ఈ సినిమాలో సోనూ సూద్‌, అంకితా లోఖాండే, అతుల్‌ కులకర్ణి వంటి నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు…