తెలుగు సినిమాల కోసమే ఆ బాలీవుడ్ అవకాశం వదులుకున్నా : సుధీర్ బాబు

Wednesday, June 13th, 2018, 10:14:48 AM IST

నాటితరం సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్న అల్లుడు, నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు కు బావ అయిన హీరో సుధీర్ బాబు కెరీర్ పరంగా ఇప్పటివరకు గుర్తుండిపోయే విజయాలెవీ అందుకోలేదని చెప్పాలి. రెజీనాతో చేసిన తొలి చిత్రం ఎస్ఎమ్ఎస్ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సుధీర్ ఆ తరువాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కధా చిత్రం సినిమాతో హిట్ అందుకుని మంచి పేరు సంపాదించారు. అయితే ఆ సినిమా విజయం ఆయనకు మంచి ఊపునిచినప్పటికీ అప్పటినుండి ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాలలో ఏ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సమ్మోహనం సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్న సుధీర్, మంచి కథ, కథనాలతో వస్తున్న ఈ చిత్రాన్ని ఇంద్రగంటి ఎంతో అద్భుతంగా మలిచారని, ఈ చిత్రంతో తప్పక విజయాన్ని అందుకుంటాను అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక తన కెరీర్ లో హిందీలో విలన్ పాత్రలో బాలీవుడ్లో నటించిన బాఘీ సినిమా మంచి పేరు తీసుకువచ్చిందని అన్నారు. అయితే ఆ చిత్రంలో తన నటన నచ్చి కరణ్ జోహార్ తన తదుపరి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేయనున్న చిత్రంలో మంచి ప్రాధాన్యమున్న పాత్ర తనకు ఆఫర్ చేసారని, అయితే తాను ప్రస్తుతం తెలుగు చిత్రాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఆ ఆఫర్ ను వదులుకున్నట్లు చెప్పాడు. నిజానికి ఆ చిత్రంలో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారని చెప్పాడు. ఇక సమ్మోహనం తర్వాత మరొక రెండు చిత్రాల్లో నటిస్తున్న సుధీర్, వాటి తరువాత బాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తారని తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments