నాకో మంత్రి పదవి ప్లీజ్..!

Saturday, October 18th, 2014, 12:03:10 PM IST

TRS-ministers
టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా మరోసారి అలర్ట్ అవుతున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ముహూర్తంకోసం ఆయన తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీపావళి రోజు లేదా దానికి ఒక రోజు అటు ఇటుగా మంత్రి వర్గ విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ ఆశావాహుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లివిరుస్తోంది.

మంత్రివర్గంలో బెర్త్‌ దక్కించుకునేందుకు అనేక మంది నేతలు తమప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. ఇందుకోసం సీఎంతో పలువురు ఎమ్మెల్యేలు మంతనాలు జరిపుతూనే వున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్‌తో భేటి అయ్యారు. సీఎం నుంచి ఖచ్చితమైన హామీని తీసుకున్నట్లు సమాచారం. ఇక సీఎంతో కలిసేందుకు మరింత మంది తమవంతు ప్రయత్నాలను చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముఖ్యమంత్రితో కాకుండా ఆయన కుటుంబ సభ్యులుగా వున్న మంత్రులు కె టి. రామరావు, హరీష్‌రావుతో పాటు నిజమాబాద్‌ ఎంపి కవితతోనూ మంత్రివర్గంలో చోటుకోసం వారితో సంప్రదింపు లు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు నుంచి ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించిన వారితోపాటు ఇ టీవల వివిధరకాల కమిట్‌మెంట్లతో పార్టీ తీర్థం పుచ్చుకు న్న వారికి సీఎం న్యాయం చేయాల్సిన అవసరముంది. ప్ర స్తుతం సీఎంతో సహా 12మంది మంత్రివర్గంలో కొనసాగు తున్నారు. కేవలం ఐదుగురికి మాత్రమే ఇందులో చోటు లభించే అవకాశముంది.

కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యంలేని ఖమ్మంతోపాటు పాలమూరు జిల్లాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఎమ్మెల్యే వుండడంతో ఆ జిల్లా నుంచి ఇటీవల టీఆరెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది. ఇక పాలమూరు నుంచి పార్టీ సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావుతోపాటు లక్ష్మారెడ్డి లలో ఒకరికి ఛాన్స్‌ లభించే అవకాశముంది. అయితే జూపల్లి వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. అయితే ఈ సామాజికవర్గంనుంచి ఇప్పటికే ఏడుగురికి మంత్రివర్గం లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ల క్ష్మారెడ్డికి ఛాన్స్‌ లభించే అవకాశం ఎక్కువగా వుందనే అభిప్రాయాలున్నాయి.

ఎస్సీలో ఒక సామాజికవర్గానికి మాత్ర మే ఇప్పటివరకు ప్రాతినిధ్యం కల్పించడంతో మరో సామాజిక వర్గం నేతగా కొప్పల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహిళా కోటా కింద నల్గొండ నుంచి గొంగిడి సునీత, వరంగల్‌ నుంచి కొండా సురేఖలలో ఒకరికి ఛాన్స్‌ లభించనుంది.ఎస్సీలకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ప రిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కకపో తే ప్లీనరీ తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరును పరిశీలించి కొందరికి ఉద్వాసన పలకాలని ముందుగా సీఎం భావించిన అందుకు తాత్కలి కంగా బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది.

మంత్రులుగా ఉద్వాసన పలికిన వారికి పార్టీలో కీలకమైన బాధ్యతలను అప్పగించాలని యోచించారు. అయితే ఈ బాధ్యతలను అప్పగించేందుకు ఏర్పాటు కావాల్సిన పార్టీ విసృత్తస్థాయి సమావేశం వాయిదా పడడంతో ఉద్వాసనకు బ్రేక్‌ వేసినట్లు సమాచారం. ప్లీనరీ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొందరికి ఉద్వాసన పలికి ఆ తర్వాత మిగిలిన సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకో వాలని భావనలో సీఎం వున్నట్లు సమాచారం. ఈ నేపథ్యం లో పార్టీ ప్లీనరీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు చోటు లేకున్నా మార్పు చేర్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.