ఆయనతో కలిసి నటించాలని వుంది : హీరోయిన్ షాలిని పాండే

Monday, June 11th, 2018, 12:15:22 PM IST

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి షాలిని పాండే. విజయ్ దేవరకొండ సరసన నటించిన ఆమె తొలిచిత్రంతోనే కుర్రకారు మనసు దోచింది. కాగా ప్రస్తుతం ఆమె తమిళంలో జివి ప్రకాష్ సరసన తెలుగులో విజయవంతమైన 100% లవ్ చిత్రాన్ని అక్కడ పునర్నిర్మిస్తున్న 100% కాదల్ చిత్రంలోను, అలానే జీవ సరసన గొరిల్లా అనే మరొక తమిళ చిత్రం లోను నటిస్తోంది. ఇటీవల అక్కడి మీడియాతో ముచ్చటించిన ఆమె తన చిత్ర అనుభవాలను గురించి వారితో పంచుకుంది. నిజానికి మొదటి సినిమా అర్జున్ రెడ్డి లో తనకు అవకాశం దక్కినపుడు చాలా భయం వేసిందని, తాను పుట్టి పెరిగింది ముంబై లో కావడంతో తెలుగు సరిగా రాదని, అంతే కాక కో స్టార్స్ తో ఎలా ఉండాలో, అలానే దర్శక నిర్మాతలతో ఎలా మెలగాలో తెలియక మొదట్లో కాస్త కంగారు పడ్డట్లు చెపుతోంది ఈ అమ్మడు.

అయితే ఆ తరువాత మెల్లగా దర్శకుడు సందీప్ రెడ్డి సహాయంతో తెలుగు డైలాగులను అర్ధం చేసుకోవడం, సహనటులతో కలిసి ఉండడం నేర్చుకున్నాను అని చెపుతోంది. అయితే ఆ చిత్రం అద్భుత విజయం తరువాత తనకు బాగానే ఆఫర్లు వచ్చినప్పటికి ఏదిపడితే అది ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు చెపుతోంది. ఇక తెలుగులో వలె తమిళం లో కూడా 100% కాదల్ చిత్రం మంచి విజయం సాదిస్తుందని ఆమె ఆశ భావం వ్యక్తం చేస్తోంది. ఇక తనకు ఇష్టమైన నటులలో తమిళ నటుడు కమల్ హాసన్, అలానే ధనుష్ వున్నారని చెప్తోంది. ఎప్పటికైనా నటుడు కమల్ సరసన ఒక్కచిత్రంలో అయినా నటించాలి అనేది తన కల అని చెపుతోంది షాలిని. చూడాలి మరి ఆమె ఆశ రానున్న రోజుల్లో ఎంతవరకు నెరవేరుతుందో……