నా రహదారిలో నేను వెళతాను : రజినీకాంత్

Thursday, May 10th, 2018, 09:08:52 AM IST

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన నూతన చిత్రం కాలా. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రజినీకాంత్ మాట్లాడుతూ, ఈ వేడుక చూస్తుంటే చిత్ర విజయోత్సవ వేడుకలా ఉందని అన్నారు. తాను శంకర్ దర్శకత్వంలో చేసిన శివాజీ విజయోత్సవ వేడుకకు విచ్చేసిన కరుణానిధి మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని, ఇప్పుడు ఆయన మాటలు వినడానికి అందరిలో ఒకడిగా నేనుకూడా ఎదురు చూస్తున్నాను అన్నారు. నేను మొన్న హిమాలయాలకు వెళ్ళడానికి కారణం గంగానది పరవళ్లు, అందం చూడడానికే అన్నారు. దక్షిణాదిన అన్ని నదులను ఐక్యం చేయడమే తన లక్ష్యమని, ఆదిపూర్తయ్యాక తాను ప్రాణం విడిచినా పర్వాలేదని చెప్పారు. పా. రంజిత్ మంచి అభిరుచి గల దర్శకుడని, ఇది ఆయన శైలి చిత్రం అన్నారు.

కబాలి తర్వాత ఏమి చేయాలా అనుకున్నపుడు నాకు చాలామంది దర్శకుల్లో రంజిత్ గుర్తొచ్చాడు. వెంటనే అతన్ని పిలిపించి నువ్వు ముంబైలోని ధారవి పై ఏదైనా కథ తయారుచేయగలవా అని అడిగానన్నారు. అంతే చెప్పిన వెంటనే మూడునెలల సమయంలో కథను సిద్ధంచేసాడని, ఇది రాజకీయ చిత్రమని కొందరు అంటున్నారు. నిజానికి ఇది రాజకీయ చిత్రం కాదు, రాజకీయ అంశాలు మిళితమై వున్న చిత్రమన్నారు. ఇదివరకు తాను చేసిన బాషా చిత్రంలో ఆంటోని పాత్ర, నరసింహ చిత్రంలోని నీలాంబరి పాత్రలే తనకు సరైన పోటీ అనుకుంటే ఈ చిత్రంలో నానాపటేకర్ పోషించిన హరిదారా పాత్రా అంతకంటే పెను సవాలుగా మారిందన్నారు. చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించారని, మధ్యలో సామువంటి అవరోధాలు వచ్చినప్పటికీ చిత్రాన్ని అనుకున్నట్లే తీసారని అన్నారు. గత కొన్నేళ్లుగా తనకు ఒక అపజయం ఎదురైనపుడల్లా రజని పని అయిపోయింది అనుకునేవాళ్లను తాను పట్టించుకోను అన్నారు.

ఈ గుర్రం ఇంకా పరిగెడుతూనే ఉందేంటి అని కొందరు ఆశ్చర్యపోతున్నారు అన్నారు. నిజానికి నేను పరుగెత్తడంలేదు, ఈ గుర్రాన్ని ఆ దేవుడే నడిపిస్తున్నాడు అన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఏమన్నా నా రహదారిలో నేను వెళతాను తప్ప, ఎటువంటివి పట్టించుకోను అన్నారు. దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ, కబాలి సమయంలో కొన్ని వివాదాలొచ్చినప్పటికీ రజిని సర్ నాకు మరొక అవకాశం ఇచ్చారు. ఇది ప్రజల సినిమా, సమానత్వం కోసం పోరాడే సినిమా అన్నారు. ఇందులోని రాజకీయ అంశాలు ప్రతిఒక్కరి జీవితంలోను కీలక అంశాలుగా మారుతాయని, మేము ఎంతో కష్టపడి, వ్యప్రయాసలతో తెరకెక్కించిన ఈ చిత్రం తప్పక విజయం సాధించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో ఈశ్వరి రావు, ఏఎమ్ రత్నం, మీనా, కే ఎస్ రవికుమార్, కలైపులి ఎస్ తాను తదితరులు పాల్గొన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments