చైతన్య తండ్రిగా గర్వపడుతున్నా, ఏఎన్నార్ కొడుకుగా అసూయపడుతున్నా : నాగార్జున

Thursday, May 10th, 2018, 06:29:44 PM IST


మహానటి దివంగత సావిత్రి గారి జీవిత గాథ ఆధారంగా రూపొందిన చిత్రం మహానటి. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడదల అయి అద్భుతమైన టాక్ తో నడుస్తోంది. ఈ చిత్రాన్ని చూసినా ప్రతిఒక్కరూ కూడా ఈ చిత్రం సావిత్రిగారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అంటున్నారు. ముఖ్యంగా ఆవిడ పాత్రలో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఈ చిత్రంలో అప్పటి తరం సూపర్ స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రలకు గాను జూ ఎన్టీఆర్ ని చైతన్యను నటించమని అడిగారట.

అయితే చైతన్య ఒప్పుకున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఆయన తాతగారి పాత్ర తాను వేయలేనని, అంతటి మహనీయుడికి నేను సాటిరానని తప్పుకున్నారు. కాగా చిత్రంలో ఎఎన్నార్ గా నటించిన నాగ చైతన్యకు మాత్రం చిత్రం చూసిన వారినుండి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ విషయమై ఆయన తండ్రి నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. నేను ఒక తండ్రిగా గర్వపడుతున్నాను, అలానే ఒక కొడుకుగా అసూయపడుతున్నాను అన్నారు. నా తండ్రి లెజెండరీ నటుడు ఎఎన్నార్ గారి పాత్రలో నేను ఇప్పటివరకు నటించలేదు,

కానీ మహానటిలో ఆయన పాత్రలో నటించిన చైతన్యను చూస్తుంటే పట్టలేనంత ఆనందంగా ఉందని ఆయన ఒక వీడియో ని పోస్ట్ చేశారు. అక్కినేని సినీవిశేషాలతో ఈ వీడియో రూపొందగా, నాచురల్ స్టార్ నాని వీడియోలో వాయిస్ ఓవర్ చెప్పారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని అభిమానులు ఈ పోస్ట్ ను తెగ షేర్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు………

Comments