ఆయనతో సెల్ఫీ దిగడం ఆనందంగా ఉంది : జాన్వీ కపూర్

Thursday, May 31st, 2018, 03:12:59 PM IST

దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ మొదటి నుండి మీడియాకు అలానే ఇతర కార్యక్రమాలకు కొంత దూరంగా ఉండేవారు. శ్రీదేవి జీవించి వున్న సమయంలో ఆమె ఎక్కడికి వచ్చినా తన తల్లితోనే వచ్చేవారు. కాగా ఆమె తల్లి మరణాంతరం ఇప్పుడిప్పుడే కాస్త మీడియాతో మమేకమవుతూ, ప్రజలతో తన జీవిత, సినీ విశేషాలను పంచుకుంటున్నారు జాన్వీ. ఆమె తొలిసారి హీరోయిన్ గా బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న చిత్రం ధఢక్. వచ్చే జులై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఇప్పటినుండే ఆ చిత్ర విశేషాలను, తన సినీ ప్రయాణం గురించిన విశేషాలను జాన్వీ మీడియాతో పంచుకున్నారు. తనకి తల్లి శ్రీదేవి నటన అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక తాను బాలీవుడ్, అలానే దక్షిణాది చిత్రాలను కూడా వీలుదొరికినప్పుడల్లా చూస్తుంటానని, తనకి బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావ్, నవాజుద్దీన్ సిద్దిఖీ అంటే వల్లమాలిన అభిమానమని చెప్పుకొచ్చారు. అందునా ముఖ్యంగా తనకు రాజ్ కుమార్ రావు నటన అంటే మరీ ఎక్కువ ఇష్టమని అన్నారు.

ఆయన నటించిన బరైలీ కి బర్ఫీ చిత్రం తనకు చాలా ఇష్టమని, ఆ చిత్రంలో రాజ్ కుమార్ అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చింది. ఆ తరువాత నుండి రాజ్ కుమార్ రావు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ కానీ ఫోటో కానీ పెట్టినప్పుడల్లా మిగతావారిలా తాను కూడా షేర్ లు లైక్ లు చేసేదానినని చెప్పుకొచ్చారు. కాగా నా కల ఇటీవల ఆయనను కలిసినపుడు నెరవేరిందని, అనుకోకుండా కలిసిన ఆయనతో సెల్ఫీ దిగాలని వుంది అని అడగగానే ఆయన ఒప్పుకుని సెల్ఫీ దిగటానికి అనుమతిచ్చారని ఆనందంతో చెప్పింది. ఇక దక్షిణాది హీరో అయిన ధనుష్ తన సోదరి సోనమ్ కపూర్ తో కలిసి నటించిన రంజానా చిత్రం చూశానని, ఆ చిత్రంలో ధనుష్ నటన తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. కాగా కన్నడలో సూపర్ హిట్ సాధించిన సైరాట్ కి రీమేక్ గా వస్తున్న ధఢక్ చిత్రంలో జాన్వీ సరసన షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ కూడా తొలిసారి బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు…..