ఏ వివాదమొచ్చినా చివరికి నష్టపోయేది నిర్మాతే!

Monday, April 16th, 2018, 11:50:43 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే అంశం పెద్ద కలకలమే రేపుతోంది. తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం వస్తుంటే కొందరు నిర్మాతలు లైంగికంగా వేధిస్తున్నారు అనేది కొందరి ప్రధాన ఆరోపణ. ఈ విషయమై మొదట గాయత్రి గుప్త అనే వర్ధమాన నటి నుండి ఆ తరువాత దీన్ని పెద్ద ఇష్యూ గా మార్చిన శ్రీరెడ్డి వరకు అందరూ బలంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే నిజానికి దాదాపు 80 సంవత్సరాల తెలుగు చిత్రం పరిశ్రమ మీద ఇటువంటి మచ్చ ఎన్నడూ పడలేదు. నిజానికి తొలితరం నిర్మాణ సంస్థలయిన విజయ, వాహిని, ఏవిఎం వంటి సంస్థలు, అలానే ఆ తరువాత త్రివిక్రమరావు, దేవీవరప్రసాద్, విబి రాజేంద్రప్రసాద్ వంటి పెద్ద నిర్మాతలు ఎందరో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించారు.

ఆ తర్వాత కూడా మరికొందరు నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చి మంచి చిత్రాలను నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే నిర్మాత లేనిదే సినిమా ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే మంచి నిర్మాతలు ఉండాలి. కానీ ప్రస్తుతం నిర్మాతలకు అసలే ఓ వైపు, లీక్ ల బెడద, మరో వైపు అత్యంత ప్రమాదకరమైన పైరసీ, దానికి తోడు పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు. ఇలా ఇటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఇప్పటికే సమస్యలతో సతమవుతున్నారు. కొందరైతే ఒకటో రెండో సినిమాలు తీసి అవి ఆడకపోతె, నిలదొక్కుకోలేక ఇండస్ట్రీ నుండి నిష్క్రమిస్తున్నారు. వున్నట్లుండి ఈ కాస్టింగ్ కౌచ్ అంశంతో నిర్మాతలకు ఇండస్ట్రీలో ప్రాభవం తగ్గుతోంది.

నిజానికి కొందరు నిర్మాతలు శ్రీరెడ్డి వంటి వాళ్ళు చెపుతున్నట్లు వేధింపులకు పాల్పడినప్పటికీ ఎక్కువమంది నిర్మాతలు మాత్రం కష్టపడి పైకివచ్చిన వారే అని చెప్పకతప్పదు. అందువల్ల ఇప్పటికైనా నిర్మాతల మనుగడకు ఆటంకం కలిగించే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా టాలీవుడ్ పరిశ్రమ హుందాగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు……