నాకు ఏదైనా జరిగితే అందరి జాతకాలు ఆ ఛానల్ లో వస్తాయి : శ్రీరెడ్డి

Tuesday, April 10th, 2018, 04:22:39 PM IST

ఇటీవల కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకు తీవ్ర వేధింపులు ఎదురయ్యాయని నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర సంచలనంగా మారాయి. కేవలం తననే కాక తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు సినిమాల్లో నటించడం కోసం వస్తే వారిని లోబరుచుకుని, కుదరకపోతే వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు అనేది ఆమె ప్రధాన వాదన. అందులో భాగంగా ఆమె మొన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు తన నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేసిన తెలుగు న్యూస్ చానల్ పై వస్తున్న విమర్శలపై నటి శ్రీరెడ్డి మండిపడింది.

ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పెడుతూ, తనకు జరిగిన అన్యాయాలకు సంబంధించిన అన్ని వీడియో సాక్ష్యాలూ ‘మహా’ టీవీకి అందించిన తరువాతనే సదరు చానల్ తన సమస్యను బయటి ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వచ్చిందని చెప్పింది. తనకు ఇప్పటికే పలు బెదిరింపులు వస్తున్నాయని, తనను హత్య చేస్తారని భయంగా ఉందని, తనకేదైనా జరిగితే, అందరి పేర్లూ బుల్లితెరపై ప్రత్యక్షమవుతాయని హెచ్చరించింది. తన విషయంలో ‘మహా టీవీ’కి సంబంధాన్ని అంటగడుతున్నారని, అలాచేయడమంటే, వారంతా తమ తమ ఇళ్లకు అంటగట్టినట్టేనని వ్యాఖ్యానించింది.

శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోందని వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నానని, ఆ చానల్ తనకు అన్నం పెట్టిందని, అటువంటి చానల్ ను, యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి నీచప్రవృత్తి తనది కాదని చెప్పింది. తాను టీడీపీతో కుమ్మక్కు కాలేదని, తనకు రాజకీయ పార్టీలతో లాలూచీ పడాల్సిన అవసరం కానీ అంత నీచమైన పరిస్థితి కానీ లేదని ఆమె వివరించింది. న్యాయంగా ఒంటరి పోరాటం చేస్తున్న తనకు మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసిందని, అటువంటి మీడియాపై నిందలేస్తే, అందరి జాతకాలనూ బయటపెడతానని హెచ్చరించింది.

కొన్ని వందల మంది అమ్మాయిల మానాలు పోతున్నాయని, వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని చెప్పింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేవలం నాలుగు కుటుంబాలకె పరిమితం అయిందని, అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా వారికి మద్దతు పలుకుతూ తమవంటి చిన్నవారిని చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు…..