మూడెక‌రాల్లో ఐమ్యాక్స్‌.. గ్రేట‌ర్ విశాఖ భారీ డీల్‌!

Monday, March 12th, 2018, 11:00:38 PM IST

సువిశాల‌మైన బీచ్ .. చుట్టూ ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంతో అల‌రారే విశాఖ న‌గ‌రంపై ప్ర‌స్తుతం ప్ర‌పంచం క‌న్ను ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఓ అధికారిక స‌ర్వే ప్ర‌కారం.. పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామంగా మారిన ఏపీలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక రాజ‌ధానిగా విశాఖ‌కు పేరొచ్చింది. ఇక ఈ న‌గ‌రంలో ఐటీ, ఇన్‌ఫ్రా రంగాల్ల పెను మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని తెలుస్తోంది. అలానే విశాఖ న‌గ‌రానికి అత్యంత చేరువ‌లో కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించిన తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. మ‌రోవైపు వైజాగ్ న‌గ‌రంలో స్టార్ హోట‌ళ్లు, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ల‌తో కీల‌క‌మైన ఐటీ హ‌బ్‌గా రూపాంత‌రం చెందుతోంది. ఇదిలా ఉండ‌గానే విశాఖ తీరం పొడ‌వునా సుదీర్ఘంగా ఉన్న బీచ్ ప‌రిస‌రాల్ని అభివృద్ధి ప‌రిచేందుకు ఏటేటా వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.

ప‌నిలో ప‌నిగా విందు వినోదంలో విశాఖ – లాస్ ఏంజెల్స్‌లో మారాల‌న్న బృహ‌త్త‌ర‌మైన ప్ర‌ణాళిక ఉంది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం… బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో ఐమ్యాక్స్ థియేట‌ర్‌ని నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఐమ్యాక్స్ కం మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం కోసం గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ అథారిటీ (జీవీఎంసీ) 2.70 ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయిస్తోంది. అందుకు ఏపీ ప్ర‌భుత్వం జీవోను జారీ చేయ‌డం విశేషం. కుటుంబ స‌మేతంగా వినోదం ఒకేచోట ద‌క్కేలా ఐమ్యాక్స్ నిర్మించాల‌న్న‌ది ప్లాన్‌. ఐమ్యాక్స్ థియేట‌ర్లు, దాంతోపాటే మ‌ల్టీప్లెక్స్ భ‌వంతి, అనుబంధంగా ఓ హోట‌ల్ని నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కోసం ప్ర‌ఖ్యాత‌ ఎస్‌పిఐ సినిమాస్ సంస్థ తో గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఓ ఎంవోయూని కుదుర్చుకుంది. వైజాగ్ – సీబీఎం కాంపౌండ్ ఏరియాలో సంప‌త్ వినాయ‌క దేవాల‌యం వ‌ద్ద దాదాపు మూడెక‌రాల విస్తీర్ణంలో ఐమ్యాక్స్ నిర్మించ‌త‌ల‌పెట్టారు. వైజాగ్‌లో ఇప్ప‌టికే వీమ్యాక్స్‌, జీవీకే మాల్‌, సెంట్ర‌ల్ సినిమా వంటి చోట సినిమా వినోదానికి కొద‌వేం లేదు. లేటెస్టుగా ఐమ్యాక్స్ నిర్మాణంతో న‌గ‌రానికి కొత్త క‌ళ యాడ‌వ్వ‌నుంది.

  •  
  •  
  •  
  •  

Comments