అయోధ్య కేసులో తీర్పు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయ్

Wednesday, September 18th, 2019, 12:49:27 PM IST

అయోధ్యలోని రామ జన్మభూమి వివాదం కొన్ని దశాబ్దాలుగా కోర్టులో నానుతున్న సంగతి తెలిసిందే. 2010లో అలహాబాద్ హైకోర్ట్ 2.7 ఎకరాల భూమిని సమానంగా పంచుకోవాలని ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పటి నుండి సుప్రీం కోర్టులో నానుతున్న ఈ కేసులో తీర్పు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేయనుండడంతో ఆలోపే కేసులో తీర్పు వెలువరించాలని చూస్తున్నారు. నిన్న మంగళవారం జరిగిన విచారణలో ముస్లిం పార్టీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ శుక్రవారం విచారణకు విరామం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో హిందూ, ముస్లిం పార్టీలు తమ తమ వాదనలను పూర్తి చేయడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ముస్లిం పార్టీ ఈరోజు బుధవారం స్పందిస్తూ తమ వాదనలను వినిపించేందుకు వారం సమయం అవసరమని తెలిపింది.

అలాగే రామ్ లల్లా విరజమన్ తరపు అడ్వకేట్ తమ వాదనలు వినిపించడానికి 2 నుండి 4 రోజులు సరిపోతాయని తెలిపారు. దీంతో జస్టిస్ గొగోయ్ అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి చేయాలని తెలిపారు.