మూడేళ్ళలో కరెంట్ కోతలకు చెక్

Thursday, October 16th, 2014, 08:54:03 AM IST

rajendar
తెలంగాణ ఆర్ధికశాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఖమ్మంలో బుధవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నాటికల్లా తెలంగాణను విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే రానున్న మూడేళ్ళలో 6వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చెయ్యడానికి 35వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను రూపొందించినట్లు ఈటెల తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణలో ఖమ్మం జిల్లాను పవర్ హబ్ గా తయారుచేయనున్నట్లు తెలిపారు. అలాగే ‘కేజీ నుండి పీజీ’ విద్యా పధకం గురించి మాట్లాడుతూ తెలంగాణలో పిల్లలందరి నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని, విద్య కోసం పెట్టే బడ్జెట్ ను ప్రభుత్వం అదనపు భారంగా భావించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన అధికారులు కార్పోరేట్ స్కూళ్ళలో చదివే వారి కన్నా ఎక్కువ విజ్ఞ్యానం కలిగి ఉన్నారని ఈటెల అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జరిపిన సమగ్ర సర్వే వలన దాదాపు 12లక్షల బోగస్ రేషన్ కార్డులను గుర్తించామని, దీని వలన ప్రభుత్వానికి 20వేల టన్నుల బియ్యం ఆదా అయిందని ఈటెల రాజేందర్ వివరించారు.