హీరో నితిన్, డైరెక్ట‌ర్ క్రిష్ ఇళ్ల‌పై ఐటీ దాడి

Tuesday, January 31st, 2017, 08:30:06 PM IST

krish-and-nithin
ఐటీశాఖ సినిమావాళ్ల‌పై దాడులు షురూ చేసింది. హీరో నితిన్ ఇంటిపై, తండ్రి సుధాక‌ర్‌రెడ్డి కార్యాల‌యాల‌పై, అలాగే శాత‌క‌ర్ణి డైరెక్ట‌ర్ క్రిష్- రాజీవ్ రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల‌పైనా నేడు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు (ఐటీ) దాడులు కొన‌సాగించారు. ప్ర‌స్తుతం ఐటీ సోదాలు సాగుతున్నాయి. సంస్థ కార్యాల‌యాల నుంచి ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నార‌ని తెలుస్తోంది.

నితిన్ ఇటీవ‌లే `అఖిల్‌` చిత్రంతో నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు హీరోగా న‌టిస్తూనే, శ్రేష్ట్ మూవీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మ‌రోవైపు సినిమాల నిర్మాణం కొన‌సాగిస్తున్నాడు. అలాగే నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ కం ప్రొడ్యూస‌ర్‌. నితిన్ హీరోగా సినిమాలు నిర్మిస్తూ వ‌రుస విజ‌యాలు అందుకుంటున్నాడు. ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, హార్ట్ ఎటాక్, అ.. ఆ వంటి ఘ‌న‌విజ‌యాల్ని నితిన్ అందుకున్నారు. నితిన్ ప్రాజెక్టుల‌న్నిటా సుధాక‌ర్‌రెడ్డి ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా భాగ‌స్వామి. అలాగే ఇటీవ‌లే క్రిష్ `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాక తండ్రి రాజీవ్ రెడ్డితో క‌లిసి నిర్మాత‌గానూ కొన‌సాగారు. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. దాదాపు 50 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కాబ‌ట్టి ఐటీ దాడులు షురూ చేసింది.

అయితే పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత సినిమావోళ్ల‌కు ఎటూ పాలుపోని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఈ ఐటీ దాడులు సినిమాల నిర్మాణంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని, ఇబ్బందిక‌ర‌మైన‌వేన‌నే మాట ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది.