కొనసాగుతున్న భారత్ జోరు

Sunday, June 16th, 2013, 02:13:11 PM IST


ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ జోరు కొనసాగుతోంది. చిరకాల ప్రత్యర్ధికి ట్రోపీలో బోణీ కానీవ్వకుండా విజయం సాదించింది. మ్యాచ్ కు వరుణుడు విలన్ మారినా.. విజయం భారత్ పక్షానే నిలిచింది. పాక్ ను కట్టడి చేయడంలో బౌలర్లు చేసిన కృషికి అటు బ్యాట్ మెన్లు కూడా రాణించడంతో.. సమిష్టి కృషితో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో మ్యాచ్ లోను శిఖర్ ధావన్ చెలరేగి 48పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర వహించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంతో ఆసక్తి రేపిన దాయదుల పోరు చప్పగా సాగింది. మ్యాచ్ కు పదే పదే వరుణుడు నీళ్లు పోశాడు. భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ పై సగం ఆట వర్షార్పణం కాగా.. మిగిలిన ఆటలో ధోనీసేనదే పైచేయి సాధించాడు.. దీంతో మ్యాచ్ కాస్తా వరుణుడు వర్సెస్ టీమిండియా అన్నట్టుగా మారిపోయింది. భారత బౌలర్ల విజృంభణకు ధావన్ జోరు తోడవడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టీమిండియా తొలిసారి పాక్‌ను చిత్తుచేసింది. పాక్ బోణీ కూడా లేకుండా ఇంటిదారి పట్టింది.గ్రూప్-బి మ్యాచ్‌లో ధోనీసేన ఎనిమిది వికెట్లతో పాక్‌పై ఘనవిజ యం సాధించింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 22 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన.. రెండు వికెట్లకు మరో 17 బంతులు మిగిలుండ గా విజయతీరాలకు చేరింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ధవన్ 41 బంతుల్లో 5 ఫోర్ల తో 48 అదే జోరుతో చెలరేగిపోయాడు.

వర్షం కారణంగా మ్యాచ్‌ను అంతకుముందు 40 ఓవర్లకు కుదించారు. 166 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 11.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. రోహిత్ (18) పరుగులు చేయగా, ధవన్, కోహ్లీ క్రీజులో ఉన్నారు. ఆటకు అంతరాయం కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని కుదించారు. దీంతో టీమిండియాకు 63 బంతుల్లో 39 పరుగులు కావాలి. ధవన్ 48 పరుగుల దగ్గర వెనుదిరిగినా, కోహ్లీ 22 పరుగుల నాటౌట్ గాను దినేశ్ కార్తీక్ కూడా 11 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 39.4 ఓవర్లలో 165 పరుగులకు కుప్పకూలింది. భువనేశ్వర్, అశ్విన్, జడేజా, ఇషాంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ జట్టులో అసద్ షాఫిక్ (41) టాప్‌స్కోరర్. టాపార్డర్‌లో ఈ సారి జంషెడ్ (2) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ డబుల్ డిజిట్ అందుకున్నా ఒక్కరూ భారీ స్కోరుగా మలచలేకపోయారు. భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పాక్‌ను కట్టడిచేశారు. ఈ విజయంతో టోర్నీలో గ్రూప్ బిలో టీమిండియా టాప్ ప్లేస్ కు చేరింది.