నాల్గో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం..!

Saturday, March 6th, 2021, 05:20:21 PM IST

మొతేరాలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 135 పరుగులకే ఆలౌటవ్వడంతో ఇన్నింగ్స్‌ 25 పరుగులు తేడాతో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలం ముందు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఇద్దరి పోటీ పడి మరీ చెరో ఐదు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. దీంతో భారత్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 365 పరుగులు చేసి ఆలౌటయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 160 పరుగుల అధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 135 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు సెకండ్ ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండా పోయింది. ఇన్నింగ్స్‌ 25 పరుగులు తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక ఇప్పటికే ఫైనల్ చేరిన న్యూజిలాండ్‌తో జూన్ 18న టైటిల్ కోసం భారత్ తలపడనుంది. ఇక ఈ విజయంతో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను కిందకు నెట్టి భారత్ టాప్-1లోకి దూసుకెళ్లింది.