సీరిస్ అనుకుంటే.. పరువుకూడా పోయింది

Wednesday, January 20th, 2016, 05:10:34 PM IST


ఇండియా.. ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆస్ట్రేలియాలో వీబీ సీరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో పరాజయం పాలయిన ఇండియా కనీసం నాలుగో మ్యాచ్ లో అయిన విజయం సాధిస్తుంది అనుకున్నారు. కాని, అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. కాన్ బెర్రాలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. 350 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. మొదటి నుంచి దూకుడును ప్రదర్శించింది. రోహిత్ శర్మ 40 పరుగుల తరువాత వెనుదిరిగినా.. ఆ తరువాత వచ్చిన కోహ్లీ.. ధావన్ తో కలిసి పరుగుల సునామీని పారించారు. 277 పరుగుల వరకు వికెట్ పడలేదు. ధావన్, కోహ్లీలు ఇద్దరు శతకాలు బాదారు. ఇక 277 పరుగుల వద్ద రెండో వికెట్ పడటంతో ఇండియా పతనం ప్రారంభమయింది. ధావన్ తరువాత, ధోని, కోహ్లి ఇలా వరసగా వికెట్లు కోల్పోవడంతో.. 323 పరుగుల వద్ద చతికిల పడింది. ఈ మ్యాచ్ లో అయిన విజయం సాధించి పరువు నిలుపుకుంటుంది అనుకుంటే.. సీరిస్ తో పాటు పరువును కూడా పోగొట్టుకున్నది. ఇక చివరి మ్యాచ్ శుక్రవారం రోజున జరగనున్నది. ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తే వన్డేలలో రెండో స్థానంలో ఉంటుంది. లేదంటే మాత్రం మూడో ప్లేస్ కు పడిపోక తప్పదు.