వర్షం కారణంగా రద్దయిన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్

Thursday, June 13th, 2019, 09:17:57 PM IST

ఈ ఏడాది ప్రపంచ కప్ ఏ సందర్భంలో మొదలెట్టారో కానీ అన్ని మ్యాచ్ లు కూడా అంతగా ఎవరిని ఆకట్టుకోవడం లేదు. దానికి తోడు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దవడం జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్లు వర్షం కారణంగా ఆగిపోగా, నేడు జరగాల్సిన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దయింది. నేడు ఉదయం నుండి వర్షం కారణంగా మైదానం మొత్తం కూడా నీటితో నిండిపోయి ఉంది. దీని వలన ఇరు జట్లకు కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జరగలేదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడకపోయినా, కవర్లు తీస్తుండగా ప్రారంభమైంది. మళ్లీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్లీ కురిసింది. ఇలా గ్రౌండ్ సిబ్బంది 7-8 సార్లు కవర్లు తీస్తూ, మళ్లీ కప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరికి భారీగా వర్షం కురిసింది. దీంతో ఆటను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండు మ్యాచ్ లాడి, రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది. నేటి మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇంకెన్ని మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దవుతాయో అని క్రికెట్ అభిమానులు అందరు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే రాబోయే ఆదివారం నాడు ఇండియా మరియు పాకిస్థాన్ జట్ల మధ్యన జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలాగె రద్దయితే పరిస్థితి ఏంటి అన్నది అంచనా వేయలేకపోతున్నారు అభిమానులు. కనీసం ఆరోజైన వరుణుడు కాస్త కరుణించాలని కొందరు పూజలు కూడా చేస్తున్నారు.